Top 5 This Week

Related Posts

మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు

హైదరాబాద్: మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసులో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ హైదరాబాద్ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పును వెలువరించింది. శిక్షకు గురైన వారిలో ఎనిమిది మంది బంగ్లా దేశీయులు ఉన్నారు. ఉద్యోగాలిప్పిస్తామని 2019లో బంగ్లాదేశ్‌ మహిళలను అక్రమంగా భారత్‌కు తరలించిన కేసు ఇది. ఈ కేసులో ఉద్యోగాలు, మంచి వేతనాలు ఇప్పిస్తామంటూ మహిళలను నిందితులు నమ్మించారు. అయితే భారత్‌కు తీసుకొచ్చిన అనంతరం మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీసులు 2019 సెప్టెంబర్‌లో ఘటనపై కేసు నమోదు చేశారు. జల్పల్లిలోని వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురు బంగ్లాదేశ్‌ మహిళలకు పోలీసులు విముక్తి కల్పించారు. బాలాపూర్‌ మహిమూద్‌ కాలనీలోని ఓ ఇంటి నుంచి మరో మహిళను రక్షించారు. అనంతరం కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు రీ-రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేశారు. కేసులో A1 నుంచి A12 వరకు మొత్తం 12 మందిపై ఎన్ఐఏ అధికారులు చార్జిషీట్‌ దాఖలు చేశారు.

మొత్తం నిందితుల్లో A1, A3, A7గా పేర్కొన్న వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అనంతరం 2020 అక్టోబర్‌ 17వ తేదీన చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో 2019–2020 మధ్య తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశారు. కేసులో వాదోపవాదాల అనంతరం నిందితులపై మోపిన అభియోగం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో దోషులుగా తేలిన తొమ్మిది మందికి జీవిత ఖైదు, రూ.1.37 లక్షల జరిమానాను విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది.

Popular Articles