Top 5 This Week

Related Posts

10 మంది మావోయిస్టులకు మరణ శిక్ష

ఢిల్లీ: పది మంది మావోయిస్టులకు మరణ శిక్ష విధిస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఛత్తీస్ గఢ్ లోని జీరామ్ ఘాటీ ఘటనలో నిందితులుగా ఉన్నటువంటి పది మంది నక్సల్స్ ను ఎన్ఐఏ కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ ఈ తీర్పునిచ్చింది. దోషులుగా తేలినవారిలో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు.

ఈ ఘటనలో ఛత్తీస్ ఘట్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. నక్సల్స్ జరిపిన మెరుపుదాడిలో మొత్తం 29 మంది కాంగ్రెస్ నాయకులు, ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. బస్తర్ జిల్లా దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీరామ్ ఘాటీ వద్ద నేషనల్ హైవేపై పరివర్తన్ ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తున్న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ పై 2013 మే 25వ తేదీన మావోయిస్టులు మెరుపుదాడి చేశారు.

నక్సల్స్ ఘాతుక చర్యలో మరణించినవారిలో అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యా చరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీరితో పాటు పలువురు భద్రతా సిబ్బంది, సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఈ కేసు విచారణలో 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు భారీ సంఖ్యలో పత్రాలను పరిశీలించారు. జగదల్‌పూర్‌లోని ప్రత్యేక NIA కోర్టు న్యాయమూర్తి అభయ్ సింగ్ రాజ్‌పుత్ ఇద్దరు మహిళలతో సహా మొత్తం 10 మందిని దోషులుగా ఈ నెల ప్రారంభంలో నిర్ధారించారు. నిందితులపై మోపిన 24 అభియోగాల్లో ఏడింటికి సంబంధించి 10 మందిని దోషులుగా నిర్ధారించి వారికి మరణ శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ. 800 జరిమానా విధించారు.

అయితే హైకోర్టు ఆదేశం వచ్చిన తర్వాతే ఈ శిక్ష అమలు చేయబడుతుంది. అప్పటి వరకు దోషులు సెంట్రల్ జైలులోనే ఉంటారు. కేసులో శిక్షపడినవారు 30 రోజుల్లోపు హైకోర్టులో ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్ దాడి ఘటన, విచారణపై పలు ప్రశ్నలను సంధించారు. దీని వెనుక పెట్ట కుట్ర ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ‘సిట్’కు స్వతంత్రంగా దర్యాప్తు చేసే అవకాశం కల్పించి ఉంటే కుట్ర వెనుక గల వ్యక్తులను గుర్తించే అవకాశం ఉండేదని ఆయన అన్నారు.

అయితే బీజేపీ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ మాట్లాడుతూ, బఘేల్‌కు ఈ కేసు పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని అన్నారు. ఈ అంశంపై బఘేల్ కేవలం రాజకీయాలు చేయాలనుకుంటున్నారని రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Popular Articles