హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని మద్రాస్ రెజిమెంట్ లో ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పది రోజులపాటు తెలంగాణా పోలీసులు శ్రమిస్తే తప్ప ఆయుధాల ఆచూకీ లభ్యం కాలేదు. కేసు దర్యాప్తులో ఆద్యంతం ఆసక్తికర అంశాలు దాగి ఉండడం విశేషం. చోరీకి గురైన ఆయుధాలను స్వాధీనం చేసుకుని, కేసులో నిందితుడైన ఆర్మీ రిటైర్డ్ హవల్దార్ మల్లేష్ ను అరెస్ట్ చేసిన సందర్భంగా తెలంగాణా డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతుంది.
మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ కథనం ప్రకారం.. గత నెల 30వ తేదీన తెల్లవారుజామున మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం (కోటె)లో కొన్ని ఆయుధాలు చోరీకి గురయ్యయాయి. ఆయుధాగారం తాళాలు పగులగొట్టి ఉన్న విషయంపై ఆర్మీ ఉద్యోగి వినోద్ కుమార్ గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత బ్రిగేడియర్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆయుధాల చోరీ ఘటనపై కేసు నమోదు చేశారు. మొత్తం ఏడు పిస్టల్స్ తో పాటు నాలుగు ఏకే 203, ఒక ఇన్సాస్, నైట్ విజన్ బైనక్యులర్, ఇతర ఆయుధ సంపత్తి చోరీకి గురయ్యాయి. రెండో బిల్డింగ్ నుండి ఆయా ఆయుధాలకు సంబంధించిన తూటాలు గల బాక్సులు మిస్సయ్యాయి.

కేసు దర్యాప్తులో భాగంగా మల్కాజిగిరి పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ గా విచారణ ప్రారంభించారు. మొదటి దశలో ఇన్ సైడర్ వ్యక్తులు తప్ప బయట వ్యక్తులు చోరీ చేసే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చారు. తొలుత మూడు రోజుల్లోనే కేసు కొలక్కి వస్తుందని భావించారు. చివరికి ఆరు రోజుల్లో ముగింపునిస్తామని భావించారు. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. అనుమానితులను ప్రశ్నిస్తే పోలీసులకు ఎలాంటి లీడ్ దొరకలేదు.
ఆయుధాగారంలోకి ఎవరెవరికి అనుమతి ఉందో, వారిని జాబితాను సేకరించారు. ముందుగా పది మందిని గుర్తించారు. ఆయుధాగారం వద్దకు ఆరుగురు సభ్యుల కదలిక తరచుగా ఉంటుందని గుర్తించి, వారిని షార్ట్ లిస్ట్ చేసి విచారించారు. ఔట్ సోర్సింగ్ లో పనిచేసే ఏడుగురు ఎలక్ట్రిషియన్లను, ప్లంబర్లను, పనిష్మెంట్ పై వెళ్లిన 36 మందిని కూడా గుర్తించారు. ఇదే దశలో సెలవుపై వెళ్ళిన 54 మందిని గుర్తించి విచారించారు.. సర్వీసులో క్రమశిక్షణారాహిత్యంగా కారణంగా విధులకు దూరంగా ఉన్న ఏడుగురిని కూడా విచారించారు.

కోపంతో ఎవరైనా ఇలా చేశారా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. వారం రోజులపాటు భిన్న కోణాల్లో పోలీసులు క్రాస్ వెరిఫికేషన్ చేశారు. డ్రగ్ మాఫియా కనెక్షన్ యాంగిల్ లోనూ దర్యాప్తు చేశారు. స్పై నెట్వర్క్ కోణంలో కూడా విచారణ జరిపారు. బృందాలుగా ఏర్పడి సీసీటీవీ, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగానూ ఈ కేసు దర్యాప్తు చేశారు. ముందుగా ఇద్దరు వ్యక్తులను ప్రధాన అనుమానితులుగా భావించారు. ఇందులో భాగంగానే ఆయుధాగారం ఇంచార్జిలుగా ఉన్నటువంటి ఇద్దరిని అనుమానితులుగా భావించి విచారించారు.
కానీ ఈ ఇద్దరినీ విచారించిన తర్వాత కూడా ఎటువంటి క్లూ లభించలేదు. ఇదే క్రమంలో ఏడుగురు పెన్షన్ అవుట్ పర్సన్స్ లో ఇద్దర్ని విచారించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హవల్దార్ తో పాటు, మల్లేష్ అనే మరో హవల్దార్ ను విచారించారు. గత జూన్ 30వ తేదీన మల్లేష్ ను ఆరోగ్యం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా తీసేశారు. మల్లేష్ కంటోన్మెంట్ పక్కనే గల బాలాజీ నగర్ లో ఉంటాడు. అతనిపై అనుమానం రావడంతో అన్ని కోణాల్లో చెక్ చేశారు. ఏడో తేదీ మల్లేష్ ను నాగర్ కర్నూల్ లో ప్రశ్నించారు. ఆ సమయంలో అతను సరిగా స్పందించలేదు. దీంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానం పెరిగింది.

మల్లేష్ మొబైల్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత అతనిపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా నాగర్ కర్నూల్ పోలీసులను కోరారు. మల్లేష్ మొబైల్ ను చెక్ చేయగా వాట్సాప్ కాల్ లాగ్, చాట్స్ అన్నీ క్లియర్ చేసి ఉన్నాయి. విచారణలో అతను సమాధానం ఇచ్చే తీరు కూడా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా గోచరించింది. అందుకే అతన్నిఈనెల 8, 9 తేదీలలో విచారణకు రమ్మని చెప్పారు. కానీ విచారణకు రాకుండా మల్లేష్ తప్పించుకున్నాడు.
ఆ తర్వాత మల్లేష్ భార్యకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసు తీవ్రతను వివరించారు. ఈనెల 10వ తేదీన మల్లేష్ ను విచారణకు తీసుకువస్తానని అతని భార్య చెప్పింది. ఈమేరకు విచారణకు తీసుకువస్తున్న క్రమంలోనే మల్లేష్ ను అతని భార్య గట్టిగా నిలదీసింది. దీంతో మల్లేష్ తన భార్య ముందు నిజం ఒప్పుకున్నాడు. వెంటనే మల్లేష్ భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా, మల్లేష్ నుంచి చోరీకి గురైన ఆయుధాలను, ఇతర ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఆయుధాలను మల్లేష్ ఎలా చోరీ చేశాడంటే..?
గత నెల 30వ తేదీ రాత్రి ఆయుధాగారం వద్ద మల్లేష్ కదలికలు ఉన్నాయి. అంతకు ముందు 28, 29 తేదీల్లో ఆయుధాల చోరీ కోసం అతను రెక్కీ కూడా చేశాడు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ రాత్రి పూట పని చేయదని అతనికి తెలుసు. గత నెల 30వ తేదీ రాత్రి బాలాజీ నగర్ నుండి కార్గిల్ గేట్ గుండా మల్లేష్ లోపలికి వచ్చాడు. ఆయుధాగారంలో తాళం పగులగొట్టి తుపాకులను ఒక్కొకటిగా తీసుకుని చీకటి ప్రాంతంలో పెట్టాడు. మందుగుండు ఉన్న గది దగ్గకు వెళ్ళి గంట సేపు శ్రమించి తాళం పగుల గొట్టాడు. ఆ తర్వాత మందుగుండు సామాగ్రి తీసుకుని వెళ్ళాడు.

దాదాపు గంటసేపు లోపలే ఉండి మందుగుండు సామగ్రిని, ఆయుధాలను స్కూటీలో పెట్టుకుని రెండు కిలోమీటర్ల దూరంలో గల ఓ టెంపుల్ దగ్గర పెట్టాడు. మళ్ళీ వెనక్కి వచ్చి మ్యాగజీన్ కవర్ కోసం మళ్ళీ తిరిగి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ అతని ప్రశ్నించగా తాను మద్రాస్ రెజిమెంట్ గా చెప్పాడు. ఆ తర్వాత మ్యాగజీన్లను బ్యాగులో పెట్టుకుని బాలాజీ నగర్ లో ఉన్న ఇంటికి ఉదయం 4.30 గంటలకు వెళ్ళాడు. తిరిగి ఇంటి నుండి గుడి వద్దకు కారులో వచ్చి అక్కడ నుండి ఆయుధాలు తీసుకుని అచ్చంపేట వైపు వెళ్ళాడు.
ఓఆర్ఆర్, సాగర్ హైవే, బొంగులూరు గేట్ వైపు ప్రయాణించాడు. సీసీటీవీలు ఉంటాయని భావించి శ్రీశైలం హైవే మీదుగా వెళ్లలేదు. దిండి దగ్గర వెహికిల్ లో ఒకరిని ఎక్కించుకుని పేమెంట్ తీసుకుని ఎవిడెన్స్ క్రియేట్ చేశాడు. ఉదయం పది గంటలకు అచ్చంపేట చేరుకున్నాడు. అక్కడే తన సొంత ఇంటి ముందు గడ్డివాము లాంటి ప్రాంతంలో మట్టి తీసి ఆయుధాలను పాతిపెట్టాడు. మళ్ళీ ఐదు ఆరు రోజుల తర్వాత వాటిని తీసి పదరా గ్రామానికి తరలించాడు.
ఇదే దశలో ఈనెల 8వ తేదీన మళ్ళీ ఆయుధాలను ఇంటికి తీసుకు వెళ్ళాడు. దీని తర్వాత పదవ తేదీ భార్య హైదరాబాద్ తీసుకుని వస్తున్న క్రమంలో నిజం ఒప్పుకుంటాడు. దీంతో ఆర్మీ ఆయుధాల చోరీ కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసు తమను పది రోజులపాటు కేసు తీవ్ర ఆందోళన కలిగించిందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మొత్తంగా రిటైర్డ్ హవల్దార్ మల్లేష్ భార్య తన భర్తను గట్టిగా ప్రశ్నించి, నిజాన్ని రాబట్టి పోలీసులకు సమాచారం చేరవేయడమే ఆసక్తికర మలుపుగా భావించవచ్చు.
