Top 5 This Week

Related Posts

చోరీకి గురైన ఆర్మీ ఆయుధాలివిగో..

హైదరాబాద్: సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ లో గత నెల 30న రాత్రి జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా ఆ ఆయుధాల తస్కరణ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు అత్యంత క్లిష్టతరంగా మారిన పరిస్థితుల్లో ఎట్టకేలకు తెలంగాణా పోలీసులు ఫలితం సాధించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

తిరుమలగిరి ఏసీపీ డివిజన్ లోని బొల్లారం పోలీసులు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ ద్వారా ఆర్మీ ఆయుధాల చోరీ కేసును ఛేదించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఈ కేసులో తుపాకులను చోరీ చేసిన ఉప్పుతల్ల మల్లేష్ (37) అనే రిటైర్డ్ హవల్దార్ ను అరెస్ట్ చేశామన్నారు. మద్రాస్ రెజిమెంట్ లోనే హవల్దార్ గా పనిచేసిన మల్లేష్ పదహారేళ్లపాటు ఆర్మీలో పనిచేశాడన్నారు. గత జూన్ 30వ తేదీన రిటైర్ అయినట్లు తెలిపారు. ఉద్యోగం నుంచి ముందుగా పదవీ విరమణ చేయడంపట్ల ఏర్పడిన అసంతృప్తితో మల్లేష్ తుపాకులను తస్కరించినట్లు భావిస్తున్నామన్నారు.

గత నెల 30వ తేదీన రాత్రి 11 గంటల ప్రాంతంలో మల్లేష్ మద్రాస్ రెజిమెంట్ నుంచి ఐదు మ్యాజైన్లు సహా నాలుగు AK 203 ఆయుధాలను, మూడు మ్యాగజైన్లు సహా ఒక 5.56 MM INSAS, పన్నెండు మ్యాగజైన్లు సహా 12 9MM Auto 1A పిస్టల్స్, మ్యాగజైన్ సహా ఒక Civil 6.35 బోర్ పిస్టల్, మరో నైట్ విజన్ బైనాక్యులర్, 9MM పిస్టల్ కు ఉపకరించే 1,156 తూటాలను, ఏకే-203కి ఉపకరించే 720 తూటాలను, 5.56 ఇన్సాస్ కు చెందిన ఒక బాల్-11ను, ఐదు ట్రేసర్లను, 20 బ్లాంక్ రౌండ్స్ ను కోటే ఆయుధాగారం నుంచి తీసుకువెళ్లాడని వివరించారు.

చోరీకి గురైన మొత్తం తుపాకులను, ఇతర ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ కోణాల్లో అనుమానించినట్లు ఆర్మీకి చెందిన తుపాకులు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్లకముందే దర్యాప్తులో కనిపెట్టి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మల్లేష్ ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డడానే పూర్తి వివరాలు తదుపరి దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. మీడియా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు వీసీ సజ్జన్నార్, మహేష్ భగవత్, సుమతి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Popular Articles