హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన అనంతరం మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టానని, ఆడపడుచులందరికీ ఆయన దీవెన ఉంటుందని చెప్పారు. రేవంత్ రెడ్డి సుపరిపాలన అందించాలని, తెలంగాణాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, సీఎం ఆశార్వాదం ఆడపడుచులందరి మీదా ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు మంత్రి సురేఖ చెప్పారు.
‘ఈరోజు నేనేమీ కామెంట్లు చేయదల్చుకోలేదండీ, పండుగ వాతావరణంలో మీరందరూ వచ్చారు.. మా ముఖ్యమంత్రిగారికి ఎప్పటిలాగానే మూడోసారి రాఖీ కట్టి రావడం జరిగింది.. కట్టినప్పుడల్లా అన్నకు, అన్నవాళ్ల మనుమడికి కూడా కడుతున్నాం మూడు సంవత్సరాల నుంచి.. కొండా సురేఖను సపరేట్ చేయకండి.. నేను అందరి అడపడుచును.. గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుపెడితే పైవరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకున్నాను’’ అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆమె పేర్కొన్నారు.

కాగా పరకాల సభలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్లీ గెలిపెంచాలని సీఎం రేవంత్ చేసిన వినతిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల వివాదం, మంత్రికి షోకాజ్ నోటీసు, ఆమె వివరణ, తాజా పరిణామాల గురించి తెలిసేందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం చర్చనీయాంశంగా మారింది.
