ఖమ్మం: తెలంగాణా అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలు అధికార పార్టీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘టార్గెట్’గా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఆమె తల్లి సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం, తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకేం సంబంధమనే భావనను వ్యక్తం చేస్తూ సురేఖ లిఖితపూర్వక వివరణ ఇవ్వడం కూడా విదితమే.
ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖపై పార్టీ అధిష్టానం చర్య తీసుకోవాలని, పార్టీ నుంచి బహిష్కరించకముందే ఆమె రాజీనామా చేయడం బెటర్.. అంటూ అధికార పార్టీకి చెందిన 16 ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు నిన్న సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద సమావేశం ఏర్పాటు చేసి మరీ సీఎం రేవంత్ రెడ్డికి బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కొండా సుస్మిత వ్యాఖ్యలు, మంత్రి సురేఖ వివరణ అంశాలపై స్పందించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల అనుయాయ ఎమ్మెల్యేలు పలువురు కొండా సుస్మిత వ్యాఖ్యల వివాదంపై ‘సైలెంట్’గా ఉండడమే రాజకీయ చర్చకు దారి తీసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి గత ఎన్నికల్లో భద్రాచలం మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
ఇందులో కొత్తగూడెం నుంచి గెలుపొందిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును మినహాయిస్తే ఇక మిగిలింది ఎనిమిది మంది. వీరిలో భట్టి విక్రమార్క (మధిర), తుమ్మల నాగేశ్వర్ రావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (పాలేరు)లు మంత్రివర్గంలో ఉన్నారు. అందువల్ల సహచర మంత్రి సురేఖ అంశంలో డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు స్పందింలేదని భావించినా, మిగతా ఐదుగురు ఎమ్మెల్యేల్లో భట్టి వర్గానికి చెందిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పందించారు. శనివారం సాయంత్రం కారేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అయితే ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ అంశంలో ఇప్పటి వరకు స్పందించకపోవడం రాజకీయ చర్చకు ఆస్కారం కలిగించింది. కేవలం సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైనా కొండా సుస్మిత పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా? పొంగులేటి శ్రీనివాసరెడ్డా? అనేది తెలియడం లేదని కొండా సుస్మిత వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఓవైపు రేవంత్ రెడ్డిని, ఇంకోవైపు పొంగులేటిని ‘టార్గెట్’గా చేసుకుని సుస్మిత చేసిన వ్యాఖ్యలపై రెవెన్యూ మంత్రి క్యాంపునకు చెందిన ఆయా నలుగురు ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం వరకు కూడా స్పందించిన దాఖలాలు లేవు.
భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మంత్రి పొంగులేటి శిబిరానికి చెందినవారనే విషయం బహిరంగమే. పినపాక, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి నిన్న హైదరాబాద్ లోనే ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ నిన్న సీఎంకు అండగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న 16 మంది ఎమ్మెల్యేల్లో ఈ ఇద్దరు కనిపించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
ఇక ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు కోరం కనయ్య, జారే ఆదినారాయణలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ, సుస్మిత వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ స్పందించినట్లు కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలిచే అంశం ఎలా ఉన్నప్పటికీ, తమను రాజకీయంగా జనంలో నిలిపిన పొంగులేటిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపైనా ఈ నలుగురు ఎమ్మెల్యేలు రియాక్ట్ కాకపోవడం సహజంగానే చర్చకు దారి తీసింది. కాగా మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, శనివారం నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇంఛార్జి మంత్రిగానూ వ్యవహరిస్తుండడం ఈ సందర్బంగా గమనార్హం.

