హైదరాబాద్: కూతురు చేసిన వ్యాఖ్యలపై ఆమె తల్లికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ. ఈమేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ మల్లు రవి రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన కొండా సురేఖ కూతురు సుస్మిత పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మల్లు రవి పేర్కొన్నారు.

ఈ అంశంలో కమిటీకి అందిన సమాచారం మేరకు, అందుబాటులో గల వివరాలను పరిశీలించిన అనంతరం, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని క్రమశిక్షణ కమిటీ భావించిందని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖ ఈ విషయంపై మూడు రోజుల్లో వివరణ సమర్పించాలని మల్లు రవి కోరారు.

చిన్నారెడ్డికీ షోకాజ్:
అదేవిధంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డికి కూడా మల్లు రవి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వనపర్తిలో జరిగిన సభలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన అనుచిత ప్రసంగంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు.

జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై వేటు:
కాగా పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మల్లు రవి ప్రకటించారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి పలువురిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడడంతోపాటు, కులాల పేర్లను ప్రస్తావిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అందవుల్ల టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం మేరకు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు మల్లు రవి పేర్కొన్నారు.


