ఖమ్మం: సైబర్ దోపిడీ నేరాల కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరున్ని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ లో ఇప్పటికే నమోదైన సైబర్ దోపిడీ నేరాల కేసుల్లో గల నిందితుల్లో ఒకడైన అసలు సూత్రధారిని సైబరాబాద్ పోలీసులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నిందితున్ని హైదరాబాద్ లో నమోదైన అంతర్జాతీయ సైబర్ నేరాల కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరునిగా ప్రాచుర్యం పొందిన ఈ నిందితుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖమ్మం జిల్లాలోని ఓ మంత్రి శిబిరంలో చేరేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే ఇదే దశలో కల్లూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నమోదైన సైబర్ నేరాల్లోనూ ఇతన్ని పోలీసులు నిందితునిగా పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఈ కీలక నిందితుడు దుబాయ్ పారిపోయినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తా లేకుండాపోయిన ఈ కీలక నిందితున్ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరునిగా ఇతను బహుళా ప్రాచుర్యం పొందాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేతను కల్లూరు ప్రాంతానికి పర్యటనకు రప్పించి రాజకీయంగానూ హల్ చల్ చేశాడు. అయితే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్న ఇతన్ని పోలీసులు ప్రశ్నించి వదిలేస్తారా? లేక అరెస్ట్ చూపిస్తారా? అనే ప్రశ్నలపై సంశయం నెలకొంది. పోలీసులు ఈ అంశంలో అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వ్యాప్తిలోకి వచ్చిన ప్రచారం ఖమ్మం జిల్లాలో రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారి తీసింది.

