ప్రాచీన భారతీయ సంప్రదాయంలోని 64 కళల్లో డబ్బు సంపాదన కూడా ఉంది. కాకపోతే అందులో వాణిజ్య, వ్యవసాయంతోపాటు ఖనిజ, లోహపు వస్తువుల తయారీ వంటి అంశాలు దాగి ఉన్నాయి. ఇటువంటి నైపుణ్యాలు ప్రత్యక్షంగా ఆర్థిక సంపాదన, జీవనోపాధికిక సంబంధించిన కళలు మాత్రమే. ఇటువంటి 64 కళలు ఆసాంతం సమీక్షించాలంటే ఈ వార్తా కథనం చాలా పెద్దదవుతుందిగానీ, ఏడాదిన్నర కాలంలో రూ. 400 కోట్ల సంపాదనకు సంబంధించిన ‘కళ’ను మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వద్ద నేర్చుకోవలసిన అవసరం ఉందనేది తాజాగా జరుగుతున్న రాజకీయ చర్చ.
ఇందుకు సంబంధించి ‘సాక్షి’ దినపత్రిక నిన్న ఓ ఆసక్తికర వార్తా కథనాన్ని బ్యానర్ స్టోరీగా ప్రచురించింది. ఆ వార్తా కథనం ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు కేవలం ఏడాదిన్నరలో తనకు గల మొత్తం అప్పుల్లో రూ. 400 కోట్ల మేరకు తీర్చారనేది ఆ కథనపు అసలు సారాంశం. ఇందులోని ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిస్తే..

- ఈ ఎమ్మెల్యే ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వ్యాపారవేత్తగానూ ప్రాచుర్యం పొందిన ఈ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులూ గతంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వాటాదారులుగా ఉన్నారు.
- ఈ నేపథ్యంలోనే కొన్ని వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలకు సెక్యూరిటీ ఇచ్చారు. వీళ్లందరూ వాటాదారులుగా ఉన్న సంస్థలు గడచిన సుమారు ఆరేళ్ల వ్యవధిలో వ్యాపార అవసరాలకు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.470 కోట్ల మొత్తాలను రుణాలు తీసుకున్నాయి.
- కానీ ఏళ్ల తరబడి వడ్డీ, అసలు మొత్తాలను చెల్లించకపోవడంతో ఆయా సంస్థలను బ్యాంకులు మొండి బకాయిదారులుగా ప్రకటిస్తూ డిమాండ్, పొజిషన్ నోటీసులు కూడా జారీ చేశాయి. కార్పొరేట్ డెబ్టార్‌గా పేర్కొంటూ నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసులు కూడా నడిచాయి. ఇదంతా 2024 వరకేనట!
- ఆయా కంపెనీల్లో వాటాదారుగా, సన్నిహిత సంబంధమున్న అధికార పార్టీ నాయకుడు 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నర లోపే పరిస్థితి మారిపోయిందట. కేవలం వారమంటే వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పేరుకు పోయిన భారీ రుణ బకాయిల్లో రూ.400 కోట్లకు పైగా మొత్తాలను ఆయా సంస్థలు తీర్చేసి వ్యాపార, రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేశాయట.
- మొండి బకాయిల చెల్లింపు ప్రక్రియ లో భాగంగా 2025 మార్చి 24 నుంచి అదే నెల 31 వరకు సుమారు రూ.400 కోట్లకుపైగా జరిగిందట. అంతేకాదు 2025 మార్చి 24న బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంకు శాఖకు ఏకమొత్తంలో రూ.120 కోట్లు చెల్లించేశారట. తమ బకాయి తిరిగి వసూలైనట్లు ఆయా బ్యాంకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) కూడా జారీ చేసిందట.
- ఈ వ్యవహారంలో అసలు విశేషమేమిటంటే.. 2023 ఎన్నికల సందర్భంగా ఈ నాయకుడు సమర్పించిన అఫిడవిట్ లోని వివరాలేనట. తనపై 40 క్రిమినల్ కేసులతోపాటు ఆస్తుల, అప్పుల విలువలనుకూడా పేర్కొన్నారు. కానీ బ్రెజిల్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో గల తన బ్యాంకు ఖాతాల వివరాలను ఈ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదనే ఆరోపణలు ఉన్నాయట.

అయితే ఈ వార్తా కథంనపై అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యముంటే ఆ ఎమ్మెల్యే పేరు బహిర్గతం చేయాలని, అతని అవినీతిపై నిజనిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎమ్మెల్యే సంపాదనలో సీఎం, డిప్యూటీ సీఎంలకు వాటా లేకపోతే వాస్తవం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా వేలానికి వెళ్లిన తమ ఆస్తులను ఆ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్మేగా ఎన్నికైన స్వల్ప వ్యవధిలోనే రూ. 470 కోట్ల మొత్తాన్ని చెల్లించి ఎలా విడిపించుకన్నారనేది మహేశ్వర్ రెడ్డి సంధించిన సూటి ప్రశ్న.
ఈ భారీ మొత్తపు చెల్లింపులపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు, డిమాండ్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ, తన వార్తా కథనంలో ‘సాక్షి’ ప్రస్తావించిన కీలక అంశాలేమిటో తెలుసా? ’ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన యధేచ్చగా చెరువుల ఆక్రమణ, ఇసుక దందా, బెదిరింపులు, వసూళ్ల పర్వం కొనసాగించారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్వల్ప వ్యవధిలో వందల కోట్లలో చెల్లింపులు సాధ్యమయ్యాయా? అని వ్యాపార, రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి’ అని తన వార్తా కథనంలో ప్రశ్నించింది.
ఈ పరిణామాల్లోనే..ఎమ్మెల్యేగాఎన్నికైన తర్వాత కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే వందల కోట్లను సంపాదించిన అధికార పార్టీ నాయకుడు తన చతురతతో ఆర్థికంగా బలపడడం, బ్యాంకుల అప్పులను తీర్చేయడం మాత్రం ‘ఆర్ట్’ కాదా? మొత్తం అరవై నాలుగు కళల్లో ఒకటిగా ఉన్నటువంటి ‘ఆర్థిక’ సముపార్జనను ఏమాత్రం ‘కళ’గా గుర్తించకుండా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇలా డిమాండ్ చేయడం అసలైన రాజకీయ చర్చ కాదా మరి!?

