ఖమ్మం: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రయాణీకులకు నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. దివ్య శుభవార్త వినిపించారు. ఈ మార్గంలో ఖమ్మం శివార్లలోని తల్లంపాడు ఎంట్రీ వద్ద ప్రయాణీకులను ఈనెల 2వ తేదీనగాని, లేదంటే 3వ తేదీ నుంచిగానీ అధికారికంగా అనుమతిస్తామని ఆమె ప్రకటించారు. ఈమేరకు ఆమె ‘సమీక్ష’ న్యూస్ తో మాట్లాడారు.
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఇప్పటి వరకు వైరా నుంచి మాత్రమే అధికారికంగా వాహనాలు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం నుంచి తల్లంపాడు ఎంట్రీ నుంచి నేరుగా రాజమండ్రి వైపు వాహనాలు అనుమతించారనే ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. ప్రస్తుతం కోదాడ మార్గంలోని ఎంట్రీ వద్ద మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నట్లు చెప్పారు. తల్లంపాడు నుంచి కోదాడ ఎంట్రీ వరకు చిన్నా, చితకా పనులు ఇంకా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే పెయింటింగ్ పనులు, బారికేడ్ల ఏర్పాటు వంటి పనులు కొనసాగుతున్నాయని దివ్య పేర్కొన్నారు. ఆదివారం ఉదయం, లేదంటే సోమవారం ఉదయం నుంచి తల్లంపాడు ఎంట్రీ వద్ద నేరుగా రాజమండ్రి వెళ్లేందుకు వాహనాలు అనుమతించనున్నట్లు చెప్పారు. వాహనాల రాకపోకలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయకుండా అనుమతించలేమన్నారు. ఒకటీ, అరా కార్లు వెడుతుంటే హైవేపై తల్లంపాడు ఎంట్రీ పాయింట్ వద్ద కూడా అనుమతించారనే ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
కాగా తల్లంపాడు వద్ద వాహనాలను అధికారికంగా అనుమతిస్తే ఖమ్మం నగరంలో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గనుంది. తిరువూరు, నూజివీడు, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు ప్రయాణీకులకేగాక, ఇదే మార్గంలో ఒడిషా, కలకత్తా వైపు వెళ్లే భారీ వాహనాలు ఖమ్మంలోకి రాకుండానే నేరుగా గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రయాణించనున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే వారికి దాదాపు 60 కి.మీ. ప్రయాణ దూరం తగ్గనుంది.

