ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కాంతారావుపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈనెల 26వ తేదీన ఎఫ్ఐఆర్ నెం. 589/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 69, 351(2) సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దీంతో తనను పోలీసులు అరెస్ట్ చేయవచ్చనే భావనతో రేగా కాంతారావు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రేగా కాంతారావు తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపి హైకోర్టు నిర్ణయం ప్రకటించేవరకు కాంతారావు అజ్ఞాతంలోనే ఉంటారని తెలుస్తోంది. కాగా రేగా కాంతారావు వినియోగించే మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ లో ఉన్నాయి. తన సోషల్ మీడియా ఖాతాల్లో అత్యంత చురుగ్గా ఉంటూ, పలు అంశాలపై వేగంగా స్పందించే కాంతారావు తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించిన దాఖలాలు లేవు.

