తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు..? ‘ఓ అధికారిని ఎక్కడ నియమించాలనేది ఆ ప్రభుత్వం యొక్క విచక్షణాధికారం (Discretionary power).. ఆ విచక్షణాధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు..’ అని అంటున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ఆ పోస్టు నుంచి తొలగించాలని, మరో అర్హత గల అధికారిని ఆయన స్థానంలో నియమించాలని తెలంగాణా హైకోర్టు మొన్న ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నిన్నటి స్పందనలోని అత్యంత ముఖ్యాంశమిది. హైడ్రా పనితీరు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, బీఆర్ఎస్ నేతలే కబ్జాలకు పాల్పడి కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేస్తున్నారని సీఎం చేసిన మిగతా వ్యాఖ్యల అంశం ఎలా ఉన్నప్పటికీ, హైడ్రా పనితీరుపై సీఎం స్పందించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవడానికి సమర్థులుగా భావించి తాము ఎంచుకున్న అధికారులను ఎక్కడైనా నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. పరిపాలనా సౌలభ్యంలో ఇదో భాగం కూడా. రాష్ట్ర రాజధాని నగరంలో దురాక్రమణకు గురైన చెరువులను, కుంటలను, నాలాలను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థకు రంగనాథ్ సమర్ధుడైన అధికారిగా ప్రభుత్వ భావించి ఉండొచ్చు.. అందువల్లే ఆయనకు అత్యంత కీలక బాధ్యతలను అప్పగిస్తూ, అవసరమైన బలగాన్ని, నిధులను ప్రభుత్వం సమకూర్చు ఉండొచ్చు.
హైడ్రా విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం.. తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రంగనాథ్ తన టీంతో గడచిన రెండేళ్ల కాలంలో లక్షన్న కోట్ల రూపాయల విలువైన 3,325 ఎకరాల ప్రభుత్వ ఆస్తులను కాపాడి ఉండొచ్చు. అన్యాక్రాంతమైన అనేక చెరువులను, కుంటలను కబ్జాదారుల నుంచి సంరక్షించి ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తమకు అప్పగించిన విధులు నిర్వహిస్తున్న అధికారులకు సమస్యలు ఉత్పన్నం కావడం కూడా కొత్తేమీ కాదు. తమకు అన్యాయం జరిగిందని భావించిన వారు కోర్టుల్లో అధికారులపై కేసులు దాఖలు చేసి న్యాయపరంగా పోరాడే వాళ్లు ఉండడం కూడా సరికొత్త విషయమేమీ కాదు. అనేక కీలక అంశాల్లో ఇటువంటి పరిణామాలను ఎదుర్కుంటూ ఢీల్లీ వరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరైన అధికారులు అనేక మంది ఉన్నారు.

కానీ హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు ఆదేశించిన కీలకాంశమేంటి? తాము ఇచ్చిన ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించడంతో పాటు, పదేపదే ఉల్లంఘించే అధికారి రూల్ ఆఫ్ లాను ప్రమాదంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని హైకోర్టు పేర్కొంది. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన శిక్షలకు సిఫార్సు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కూడా స్పష్టం చేసింది. గడచిన ఐదేళ్లలో మొత్తం 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండగా, ఏడాదిన్నరలో 63 కేసులు ఈ ఒక్క అధికారిపై ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఐజీ స్థాయి ర్యాంకులో, కార్యదర్శి స్థాయిలో ఉంటూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం హైడ్రా కమిషనర్ ప్రధాన విధిగా పేర్కొంటూ ఈ విషయం హైడ్రాను ఏర్పాటుచేస్తూ జారీ అయిన జీవో 99లో స్పష్టంగా ఉందని కూడా న్యాయస్థానం పేర్కొంది. అలాంటి అధికారిపై ఏడాదిన్నరలో 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉండడం అసాధారణమని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో కోర్టు ధిక్కరణ విచారణకు మాత్రమే పరిమితవుతున్నట్లు కూడా హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశం, చేసిన వ్యాఖ్యల్లోని కీలకాంశాలివి.

హైకోర్టు ఇచ్చిన ఆయా ఆదేశాలపై బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించారు. ఈ పరిణామం అనంతరం పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మూసీ బాధితులుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఆయా ఘటనలను ప్రస్తావించడం గమనార్హం. ఇదే దశలో నిన్న సీఎం స్పందించిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్టయ్యారు. హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ టూల్ గా అభివర్ణిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
మొత్తం పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీలో తనదైన శైలిలో స్పందించారు. చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసిన వాళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కోర్టు ధిక్కరణ అంటున్నారని, కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను మార్చాలనే నిబంధనంటూ ఉంటే గతంలో సోమేష్ కుమార్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని సీఎం అన్నారు. ఆరోజు ఇవన్నీ ఏవీ మాట్లాడలేదని, ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ఆ ప్రభుత్వం యొక్క విచక్షణగా చెబుతూ, ఆ విచక్షణాధికారాన్ని ఎవరూ గుంజుకోలేరని రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే తప్పకుండా గౌరవిస్తామన్నారు. అదేవిధంగా హైడ్రా తీసుకుంటున్న చర్యలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేయడం గమనార్హం.

ఇదే దశలో న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసముందని, తప్పుడు కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కుంటామన్నారు. హైడ్రా మంచి పనులు చేస్తోందని, తమ ప్రభుత్వం తీసుకువచ్చిన అతిగొప్ప సంస్కరణ హైడ్రా.. అని సీఎం అన్నారు. హైడ్రాను బెస్ట్ సంస్థగా ప్రశంసిస్తూ, ఈ సంస్థ కొట్టేదే బడా బాబులను… అని అన్నారు. పార్కులు, చెరువులు, కుంటలు ఆక్రమించుకుంటే కూల్చేస్తామని, హైడ్రా పనే అది.. అని చెబుతూ దాని పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇటువంటి సమయాల్లో, సందర్భాల్లో కోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వ అధికారుల ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా పాలకులు కితాబునివ్వడం సహజమే కావచ్చు.
కానీ మొత్తం అంశంలో హైకోర్టు చెప్పిన అత్యంత కీలకాంశం ఏమిటంటే.. ‘ ప్రస్తుత కేసులో కోర్టు ధిక్కరణ విచారణకు మాత్రమే పరిమితవుతున్నట్లు’ స్పష్టంగా పేర్కొనడం. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఏవీ రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తొలగించి మరో అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సిందేమిటి? అనే అంశంపై న్యాయవాద వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీలుకు వెళ్లవచ్చు. తద్వారా రంగనాథ్ అంశంలో న్యాయస్థానంలోనే పోరాడవచ్చు.. అని చెబుతున్నాయి.

డివిజన్ బెంచ్ ప్రభుత్వ అప్పీలును స్వీకరించి, విచారించి, తదుపరి ఆదేశాలు లేదా తీర్పు ఇచ్చే వరకు పాలకులు పోరాడవచ్చు. అప్పటి వరకు హైడ్రా వ్యవస్థ తన పని తాను చేసుకుపోవచ్చు. కానీ ఏ అధికారిని ఎక్కడ నియమించుకోవాలనేది ప్రభుత్వ విచక్షణాధికారమని, దాన్ని ఎవరూ గుంజుకోలేరంటూ సీఎం చేసిన కీలక వ్యాఖ్యే ఇప్పుడు చర్చకు దారి తీసింది. సీఎం స్పందనలోని గమనించాల్సిన మరో అంశమేమిటంటే.. హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ, కబ్జాదారులు బీఆర్ఎస్ నాయకులుగా ఆరోపణలు చేస్తూనే రంగనాథ్ నే కొనసాగిస్తామని ఆయన ఎక్కడా ఉటంకించకపోవడం గమనార్హం. నిన్నటి తన స్పందనలో సీఎం రేవంత్ రెడ్డి రంగనాథ్ పేరును ఉచ్ఛరించకుండానే తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పేయడమే జరుగుతున్న అసలు చర్చ. ఎందుకంటే రంగనాథ్ అయినా, మరో అధికారి అయినా ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడమే వారి విధుల్లో భాగం. కానీ ‘విచక్షణాధికారం..’ అనే పదాన్ని పేర్కొంటూ సీఎం చేసిన వ్యాఖ్య ప్రజల్లో ఎటువంటి భావనను స్ఫురింపజేస్తోందనే ప్రశ్నపైనా అధికార పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాదులు కొందరు చెబుతున్న కీలక పాయింట్ ఏమిటంటే..? ‘కోర్టు ఇచ్చిన ఆదేశపు ప్రతిలో రంగనాథ్ ను తొలగించాలని న్యాయమూర్తి రాసి ఉంటే మాత్రం ప్రభుత్వం దాన్ని పాటించాల్సి ఉంటుంది. కేవలం బెంచ్ పై వ్యాఖ్యకు మాత్రమే అది పరిమితమైతే మాత్రం రంగనాథ్ ను ఆ స్థానం నుంచి తప్పించాల్సిన అవసరం ఉండకపోవచ్చు…’ అని న్యాయవాద వర్గాలు చెబుతుండడం గమనార్హం.

