హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ఆ పోస్టు నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణా హైకోర్టు నిన్న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యను చేసింది. గ్రీకు పురాణంలోని ‘హైడ్రా’ అనే జలరాక్షసి (అనేక తలల పాము) అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ సర్పాని జయించడం అసాధ్యమని, హైదరాబాద్ లోని హైడ్రా కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్లుందని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఇటువంటిదాన్ని అనుమతిస్తే ప్రజల హక్కులను పరిరక్షించే న్యాయస్థానాలకు మరణశాసనమేనని ఆయన పేర్కొన్నారు. గడచిన ఏడాదిన్నర కాలంలో హైడ్రా కమిషనర్ పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని ప్రస్తావించారు. కోర్టుకు ఇచ్చిన హామీని హైడ్రా కమిషనర్ తుంగలో తొక్కారని అన్నారు. న్యాయస్థానాల ఆదేశాల అమలే ప్రజాస్వామ్యానికి కొలమానమని, ఉల్లంఘన కోర్టు గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో కేవలం కోర్టు ధిక్కరణపై మాత్రమే విచారణకు పరిమితమవుతున్నట్లు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
కాగా తనపై ‘ధిక్కరణ’ కేసులు దాఖలు చేసింది భూకబ్జాదారులేనని హైకోర్టుకు క్షమాపణ చెప్పిన అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వాళ్లందరికీ హైడ్రా కమిషనర్ గా అడ్డుపడడటమే తాను చేసిన తప్పుగా ఆయన పేర్కొన్నారు. తనపై దాఖలైన ధిక్కరణ కేసులను చట్టపరంగానే ఎదుర్కుంటానని, తనకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకముందన్నారు.

