హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణా హైకోర్టు మరోసారి ఆగ్రహించింది. తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రా కమిషనర్ కు అలవాటుగా మారిందని హైకోర్టు మండిపడింది. ఒకే భూమికి సంబంధించి మూడు మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టు చరిత్రలోనే లేదని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్‌లోని శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన మూడు ధిక్కరణ పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది
మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైనప్పటికీ హైడ్రా కమిషనర్ కనీసం క్షమాపణలు కూడా చెప్పకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన అధికారి క్షమాపణలు చెప్పడం కనీస ధర్మమని పేర్కొంది. అసలు కేసుల్లో గానీ, రివిజన్ పిటిషన్లలో గానీ భాగస్వామికాని హైడ్రా కమిషనర్‌కు కోర్టు రక్షణలో గల ఆస్తుల విషయంలో జోక్యం చేసుకునే అధికారాలు ఎక్కడివని ప్రశ్నించింది.
ఆక్రమణలను అడ్డుకోవడానికి ఇప్పటికే రెవెన్యూ, నీటిపారుదల వంటి చట్టబద్ధమైన శాఖలు ఉన్నప్పుడు, ప్రతి విభాగం హైడ్రా వద్దకే వెళ్తే ఆయా శాఖల ఉనికికి అర్థమేముంటుందని హైకోర్టు నిలదీసింది. జీవో ప్రకారం హైడ్రాకు పోలీసు బలగాలు, భారీ కూల్చివేత యంత్రాలను మోహరించే అధికారం ఎలా వచ్చిందో చెప్పాలని పేర్కొంది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ ఉత్తర్వులు హాస్యాస్పదంగా మారతాయని, చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు హెచ్చరించింది.
దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత క్షమాపణలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
