భద్రాచలం: గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని రెెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు 15 రోజుల ముందే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంలో ప్రతీ 10 రోజులకోసారి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలన్నారు. ఈమేరకు మంత్రి పొంగులేటి ఆదివారం భద్రాద్రి రాములోరిని దర్శించుకున్నారు.
సీతారామచంద్రస్వామి దర్శనానంతరం ఆలయంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పునరుద్ధరణ పనుల రూపకల్పన, పురోగతి, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్‌ల ద్వారా ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేసిందని మంత్రి చెెప్పారు.
ఆలయ అభివృద్ధి, విస్తరణ కోసం అవసరమైన భూసేకరణకు సుమారు రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పునరుద్ధరణ పనులను వంద శాతం పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంజినీరింగ్, దేవాదాయ శాఖల అధికారులతో ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, భద్రాచలం గ్రామ సర్పంచ్ పూనెం దొర, దేవస్థానం ఈవో దామోదర్ రావు ఆర్కిటెక్ మూర్తి, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

