(సమీక్ష ప్రత్యేక కథనం)
‘‘నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నరు.. 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీషు పేపర్ కొన్నడాయన. అంటే ఇగ తెలుగులో ఆడిన అబద్ధాలన్నీ చాలవన్నట్టు.. ఇంగ్లీషుల గూడ అబద్ధాలాడ్తరన్నట్టు. పయనీర్ పత్రికను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్వాధీనం చేసుకుంది. దయచేసి ఆ పత్రికను నమ్మొద్దు.. పయనీర్ పేపర్లో వచ్చే ఏ అంశమైనా బీఆర్ఎస్ పార్టీ దృక్పథాన్నే ప్రతిబింబిస్తుంది… అని ఇంగ్లీషులో వ్యాఖ్యానించారు. ఏందిదీ..? పత్రికలు కొంటం? యూ ట్యూబ్ ఛానళ్లు కొంటం? ప్రజా బలం ఉండాలె! గుండె ధైర్యం ఉండాలె! ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి.. అవసరమైన కాడ..’’ ఇదీ తెలంగాణా రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణ ఇది. ఈనెల 9వ తేదీన కొత్తగూడెం పర్యటనలో కవిత చేసిన ప్రసంగంలోని కీలక అంశమిది.

కవిత చేసిన ఈ ఆరోపణ మీడియా సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దేశంలో సుదీర్ఘ చరిత్ర గల పయనీర్ ఆంగ్ల పత్రిక ఇటవలి కాలంలో ‘ఫ్రాంచైజీ’ విధానంలో నడుస్తుండడం గమనార్హం. ఢిల్లీ కేంద్రంగా నడిచే ఈ పత్రికకు దేశవ్యాప్తంగా పలు ఎడిషన్లు కూడా ఉన్నాయి. గత కొంతకాలంగా పయనీర్ పత్రిక నిర్వహణలో పలు మార్పులు కనిపిస్తున్నాయి. పత్రికను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో భాగంగానే జాతీయ ఆంగ్లపత్రిక ‘పయనీర్’ను కేటీఆర్ నిజంగానే కొనుగోలు చేశారా? బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ‘నమస్తే తెలంగాణా’ తెలుగు పత్రిక, టీ న్యూస్ ఛానల్ తో పాటు ‘తెలంగాణా టుడే’ పేరుతో ఓ ఇంగ్లీష్ పేపర్ కూడాఉంది.

అయితే పయనీర్ పత్రికను కేటీఆర్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్న కవిత ఆరోపణల్లో నిజమే ఉన్నట్లయితే మాత్రం ఆసక్తికర అంశాన్ని తప్పక తెలుసుకోవలసిందే. అదేమిటంటే.. కాంగ్రెస్ లీడర్ ఒకరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పత్రిక (కవిత ఆరోపణ ప్రకారం ‘పయనీర్’ ఆంగ్ల పత్రిక) కేరళ రాష్ట్రంలో ఫ్రాంచైజీ ఇచ్చినట్లుగానే భావించవచ్చు. బండి సుధాకర్ గౌడ్ అనే కాంగ్రెస్ లీడర్ ఐడియా ఉన్నారా? వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పంథినికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి సుధాకర్ గౌడ్ ‘పయనీర్’ పత్రిను ఇటీవలే కేరళ రాష్ట్రం మొత్తానికి ఫ్రాంచైజీ తీసుకున్నారు.
ఈమేరకు కేరళ ఎడిషన్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీడీ సతీశన్ గత సోమవారం ప్రారంభించారు. తిరువనంతపురంలోని థంపనూర్ ‘హైసింత్ హోటల్’ లో ఈ పత్రిక ఫ్రాంచైజీ ప్రారంభ వేడుక ఘనంగా జరిగింది. సీఎం వి.డి. సతీశన్ ‘పయనీర్’ దినపత్రిక కేరళ ఎడిషన్ ను ఆవిష్కరించారు. ఆ పత్రిక తొలి ప్రతిని డిప్యూటీ స్పీకర్ షానిమోల్ ఉస్మాన్ కు అందజేశారు. ఆ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, కేరళ మాజీ హోంమంత్రి రమేష్ చెన్నితల, పయనీర్ కేరళ చైర్మన్ బండి సుధాకర గౌడ్, పయనీర్ ఢిల్లీ చైర్మన్ ప్రశాంత్ తివారీ, గురురత్నం జ్ఞాన తపస్వి, పాలయం ఇమామ్ వి.పి. సుహైబ్ మౌలవి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సరికొత్త ప్రింట్ ఎడిషన్ తో పాటు, కేరళ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ ఎడిషన్ ను కూడా ఆవిష్కరించారు. ఈ వేడుకకు కేరళ ప్రభుత్వ, రాజకీయ, పరిశ్రమలు, విద్యా రంగం, మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పయనీర్ పత్రికను కేటీఆర్ కొనుగోలు చేసినట్లు కవిత చేసిన ఆరోపణలో వాస్తవమున్నట్లయితే కాంగ్రెస్ లీడర్ కు కేరళ రాష్ట్ర ఫ్రాంచైజీ దక్కడం అసలైన విశేషమే కదా! కొసమెరుపు ఏమిటంటే పయనీర్ పత్రికను కేటీఆర్ కొనుగోలు చేసినట్లు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణను అటు కేటీఆర్ గానీ, ఇటు ఆ పత్రిక యాజమాన్యంగానీ ఎక్కడా ఖండించిన దాఖలాలు లేకపోవడం.

