Top 5 This Week

Related Posts

60 రౌండ్ల ఎన్కౌంటర్, నలుగురు గ్యాంగ్ స్టర్ల హతం

గురుగ్రామ్: హరియాణాలోని గురుగ్రామ్‌లో గ్యాంగ్ స్టర్లకు, పోలీసులకు మధ్య గురువారం ఎదురుకాల్పుల ఘటన జరిగింది. ఇరు వర్గాల మధ్య 60 రౌండ్ల తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ ముఠాకు చెందిన నలుగురు క్రిమినల్స్ హతం కాగా, ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. సాయుధులైన వ్యక్తులు ప్రయాణిస్తున్న అనుమానాస్పద స్కార్పియో ఎస్‌యూవీ వాహనం గురించి క్రైమ్ బ్రాంచ్‌కు సమాచారం అందడంతో, గురువారం రాత్రి సుమారు 9:30 గంటలకు గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అందిన సమాచారం మేరకు, క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన పలు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

స్థానిక క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం… పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దిగ్బంధనం చేసేలోపే, సాయుధ అనుమానితులు ఒక వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిపారు. విదేశాల నుండి పనిచేస్తున్న ఓ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నుండి ఆ వ్యాపారవేత్తకు పదేపదే బెదిరింపులు వస్తుండటంతో, అతనే ఈ దాడికి లక్ష్యంగా మారినట్లు సమాచారం.

పోలీస్ బృందాలు అనుమానితులను చుట్టుముట్టి, లొంగిపోవాలని ఈ సందర్భంగా పదేపదే కోరాయి. అయితే నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసు సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీనికి ప్రతిస్పందనగా అనుమానితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో విదేశాలకు చెందిన దీపక్ నందల్ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులు కాల్పుల్లో గాయపడ్డారు. వారిని ఓ ప్రైవేట్ సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా, వారిలో నలుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఐదో నిందితునికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో గురుగ్రామ్‌కు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారికి వైద్య చికిత్స అందుతోంది. వైద్యులు వారి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

సీన్ ఆఫ్ క్రైమ్ యూనిట్, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, ఇతర దర్యాప్తు విభాగాల బృందాలు సంఘటనా స్థలంలో సమగ్ర శాస్త్రీయ పరిశీలన జరిపి, ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలను సేకరించాయి. చట్ట ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మరణించిన, గాయపడిన నిందితుల గుర్తింపు వివరాలు, వారి నేర చరిత్రను తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. పోలీసులు విదేశాలలో తయారైన ఐదు పిస్టళ్లను ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నారు.

Popular Articles