Top 5 This Week

Related Posts

మావోలు, గ్రేహౌండ్స్, గంజాయిపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

ఖమ్మం: మావోయిస్టులు, గంజాయి సాగు, రవాణా, గ్రే హౌండ్స్ బలగాల అంశాలపై తెలంగాణా డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రెండు రోజులపాటు పర్యటించిన డీజీపీ మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకంగా ఉండేవారని, గంజాయిని సేద్యం చేసేవారిని తీసుకువెళ్లి కొట్టేవారని అన్నారు. మావోయిస్టులు తగ్గిపోవడంతో గంజాయి సేద్యం విస్తరించిందని, దీనిపై తాము దృష్టి సారించామని చెప్పారు. గంజాయిని గ్రేహౌండ్స్ బలగాలు మాత్రమే నియంత్రించలేవని, ఈగిల్ ఫోర్స్, జిల్లా పోలీసులు మాత్రమే సమన్వయంతో ఆ పనిచేయాలన్నారు. గంజాయి సేద్యం, రవాణా చేసేవారి ఆస్తులను సీజ్ చేయడం, పీడీ యాక్టు నమోదు చేయడం వంటి పనులకోసం ఈగిల్ ఫోర్స్ ను శక్తివంతం చేయాల్సి ఉందన్నారు.

గ్రేహౌండ్స్ విభాగాన్ని పూర్తిగా రద్దు చేయలేదని, అందులో మొత్తం 1.100 మంది పోలీసులు ఉండగా, ఐదు వందల మందిని మాత్రమే మరో విభాగానికి మార్చామని, మిగతా 600 మంది గ్రేహౌండ్స్ బలగాలు అదే విభాగంలో ఉన్నాయన్నారు. మావోయిస్టులు తగ్గినప్పటికీ, పూర్తిగా సమసిపోయినట్లు కాదని, లొంగిపోయిన నక్సల్స్ కదలికలపై మరో ఒకటి, రెండేళ్లపాటు నిఘా ఉంచాల్సి ఉందన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సల్స్ పునరావాసం తదితర చర్యలపై ముందు జాగ్రత్తగా గ్రేహౌండ్స్ విభాగంలోని సగం మంది సిబ్బందిని అక్కడే కొనసాగిస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ సీవీ ఆనంద్, చిత్రంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సునీల్ దత్ కూడా ఉన్నారు

పోలీసులకు దిశా, నిర్దేశం:
‘తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ – యూజింగ్ టెక్నాలజీ’ అనే లక్ష్యంతో పోలీస్ అధికారులు ముందుకు సాగాలని డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. నేరాల నియంత్రణలో పకడ్బందీ చర్యలు, బేసిక్ పోలిసింగ్ పై దృష్టి, కీలక సంస్కరణలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లాలో శాంతిభద్రతలు, నేర నియంత్రణపై ఎస్బీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా డీజిపీ మాట్లాడుతూ, పోలీస్ యూనిఫామ్ ధరించటం అదృష్టంగా భావించి ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యంగా పోలీస్ సిబ్బంది పని చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కోట్ల మంది జనాభాలో కేవలం 0.16 శాతం మందికే ఈ అవకాశం లభిస్తుందన్నారు. ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీసు అధికారి ప్రజల సేవకు అంకితం కావాలన్నారు. బేసిక్ పోలిసింగ్ పై దృష్టి పెట్టాలని, రాత్రి గస్తీని మరింత బలోపేతం చేసి ఆస్తి నేరాలను అరికట్టాలన్నారు

చట్టం అనేది సామాన్యులకు రక్షణ కవచంలా అండగా ఉండాలని, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే రౌడీలు, గూండాలకు మాత్రం కఠినమైన పోలీసింగ్ తప్పదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అదేవిదంగా సివిల్, భూ వివాదాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి మాఫియా, రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్న ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని వివిధ సబ్ డివిజన్ల ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులు

CCTNS 3.0, హాక్ ఐ 3.0, టీజీ కాప్స్ 3.0 వంటి సాంకేతిక వేదికలను సమర్థంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఇకపై ఎఫెక్టివ్ పోలీసింగ్, స్మార్ట్ పోలీసింగ్ సమాజ శ్రేయస్సు, ప్రజలకు భరోసా ఇచ్చే దిశగా తెలంగాణ పోలీస్ ముందుకు సాగుతోందని, ఇందుకు గాను ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), సీసీ కెమెరాలు, డేటా అనలిటిక్స్, సాక్ వ్యవస్థలతో, నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

సమీక్షా సమావేశంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, అడిషనల్ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, వసుంధర యాదవ్, మహేష్, శ్రీనివాసులు, సర్వర్, సత్యనారాయణ, సుశీల్ సింగ్, నర్సయ్య, సారంగపాణి పాల్గొన్నారు.

Popular Articles