ఖమ్మం: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన ఓ రోజు ముందుకు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 9వ తేదీన సీఎం జిల్లాలో పర్యటించనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆయన పర్యటన ఓరోజు ముందుకు.. అంటే 8వ తేదీకి ఖరారైనట్లు అనధికార సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వాస్తవానికి గతనెల 30వ తేదీన జిల్లాోల సీఎం పర్యటించాల్సి ఉండగా, భారీ వర్షాల వల్ల రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే జిల్లాలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం(మత్కెపల్లి) వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పోలీసు కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి కలెక్టర్ దివాకర సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలకు అనువైన మార్గాలు, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించి, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కోసం పకడ్బంది చర్యలపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, జూన్ 30న భారీ బహిరంగ సభ నిర్వహించి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, అప్పటి భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన తేదీని ప్రభుత్వం త్వరలో అధికారికంగా ఖరారు చేస్తుందని, తేదీ నిర్ణయమైన వెంటనే ప్రజలకు అధికారిక సమాచారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అప్పటివరకు అన్ని శాఖలు పూర్తి సన్నద్ధతతో ఉండి అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని మిగిలిన పనులు సభా వేదిక నిర్మాణం, హెలిప్యాడ్ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ప్రజల కూర్చునే ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ప్రోటోకాల్ ఏర్పాట్లు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, భద్రతా బందోబస్తు వంటి అంశాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

