హైదరాబాద్: తెలంగాణా పోలీస్ శాఖ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అనేక మంది ఐపీఎస్ అధికారులకు, మాజీ డీపీజీలకు, రాజకీయ నాయకులకు భద్రతను కుదించింది. నక్సల్స్ టార్గెట్ లో గల పలువురు పోలీసు ఉన్నతాధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించింది. ఎస్కార్ట్ సదుపాయాన్ని కూడా విరమించుకుంది. రాష్ట్ర పోలీసు శాఖకు చీఫ్ గా వ్యవహరిస్తున్న డీజీపీ సీవీ ఆనంద్ సైతం తన ఎస్కార్ట్ వాహనాలను సరెండర్ చేయడం గమనార్హం. తెలంగాణా మావోయిస్టుల రహిత రాష్ట్రంగా ఏర్పడినట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులకు, ప్రస్తుత ఐపీఎస్ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించారు. వీరిలో మాజీ డీజీపీలతోపాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో గల పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అదేవిధంగా అనేక మంది రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు కూడా భద్రతను తగ్గించారు. గన్ మెన్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది భద్రతను వన్ ప్లస్ వన్ గన్ మెన్ల వరకే పరిమితం చేశారు.

