సత్తుపల్లి: ‘డెకాయిటీ’ (దోపిడీ) కేసులోని మొత్తం 14 మంది నిందితుల ముఠాలో రిజర్వుడ్ విభాగానికి చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్ కూడా నిందితులుగా ఉన్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెలుగు చూసింది. ఒకటికి నాలుగు రెట్లు డబ్బు ఇస్తామంటూ నమ్మబలికి, ఫోన్లు చేసి, రప్పించుకున్న వ్యక్తులను పోలీసుల పేరుతో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ఈ ముఠా గుట్టును సత్తుపల్లి పోలీసులు రట్టు చేసినపుడు ఈ అంశం బహిర్గతమైంది. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి అనే బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెల 25వ తేదీన నమోదైన కేసులో సత్తుపల్లి పోలీసులు దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు. కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ గురువారం మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం..
ఇదీ ముఠా చేసే నేరం స్టైల్:
అమాయకులను మోసం చేసి, దొడ్డిదారిన డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఈ ముఠా మొబైల్ సిమ్ కార్డులను తీసుకుంటుంది. ఆయా సిమ్ ల ద్వారా ఏదో ఒక నెంబర్ కు ఫోన్ చేసి, ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే ‘నా పేరు మహేందర్ రెడ్డి @ బాలగంగాధర్ @ చంద్రం @ చంటిబాబు వంటి పేర్లు చెబుతూ ముఠా అమాయకులను ముగ్గులోకి దించుతుంది.
తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటామని, తమ ఎకౌంట్లో రూ. 2.00 కోట్ల బ్లాక్ మనీ ఉందని, ఆదాయపు పన్ను సమస్య ఉందని చెబుతుంటారు. ఆ బ్లాక్ మనీని తాము వైట్ మనీగా మార్చాలనుకుంటున్నామని, మీరు ఎవరైనా డబ్బు ఇస్తే అందుకు బదులుగా ఒకటికి నాలుగు రెట్లు డబ్బు ఇస్తామని నమ్మబలికేవారు. తాము నగదు రూపంలోగాని, అకౌంట్ ద్వారా గానీ చెల్లిస్తామని, నమ్మకం ఉంటే తాము చెప్పిన ప్రదేశానికి డబ్బు తీసుకుని వస్తే, తమ మనిషి అక్కడికి వస్తాడని చెప్పేవారు. వీరి మాటలు నమ్మి వచ్చిన వ్యక్తికి డబ్బును చూపి, అకౌంట్ నెంబర్ ఇస్తే ఒకటికి నాలుగు రెట్లు అధిక మొత్తాన్ని జమ చేస్తామని చెప్పేవారు. రూ. 10.00 లక్షలు ఇస్తే, రూ. 40.00 లక్షలు అకౌంట్ లో వేస్తామని, ఆ డబ్బు నుంచి మీరు రూ. 12.00 లక్షలు తీసుకుని, తమకు ఇచ్చిన రూ. 10.00 లక్షలు పోగా, మిగతా రూ. 18.00 లక్షలు తమకు నగదుగా ఇవ్వాలని మోసపు మాటలు చెప్పేవారు.

ఈ మొత్తం ప్రక్రియలో ముఠాను నమ్మి వచ్చిన వ్యక్తులకు అదే ముఠాలోని ఓ సభ్యుడు వచ్చి చిల్డ్రన్స్ ఆడుకునే డమ్మీ కరెన్సీ నోట్లు ఉన్న బ్యాగును ఇచ్చి పంపేవారు. ఈ తతంగంలో ముఠాను నమ్మి వచ్చిన వ్యక్తి ఇచ్చిన ఒరిజినల్ నోట్లు ముఠాలోని సభ్యుడు లెక్కించే సమయంలో ముఠా ముందే ఏర్పాటు చేసుకున్న నకిలీ, ఒరిజినల్ పోలీసులు కార్లలో వచ్చి ఆ వ్యక్తిని బెదిరించేవారు. దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారని, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అంటూ బెదిరిస్తే నమ్మి వచ్చిన వ్యక్తులనేగాక, తమ ముఠాలోని సభ్యున్ని కూడా పథకం ప్రకారం కొట్టేవాళ్లు. తద్వారా తమ ఫోన్ కాల్ ను విశ్వసించి డబ్బుతో వచ్చిన వ్యక్తులను ఇదే తరహాలో బెదిరించి దోచుకునేవాళ్లు.
ఇలా అనేక మందిని మోసం చేసి, దోపిడీ ముఠాకు చెందిన మొత్తం 14 మంది నిందితుల్లో 12 మందిని సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఏలూరు జిల్లా కలిదిండి మండలం వెంకటాపురానికి చెందిన ఈద చంటిబాబు, ఖమ్మం జిల్లా తుంబూరుకు చెందిన ముళ్లగిరి వర్ధన్, ఏలూరు జిల్లా నర్సాపురానికి చెందిన మువ్వా సత్యనారాయణ, ఖమ్మం జిల్లా బేతుపల్లి గంగారానికి చెందిన బేరా కేశవరావు, చింతలపూడి మండలం మల్లాయగూడేనికి చెందిన మారుముడి మధు, వేంసూరు మండలం బీరవల్లికి చెందిన గోరంట్ల గౌతమ్, నేలకొండపల్లి మండలం సదాశివపురానికి చెందిన కర్లపూడి నవీన్, సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన నక్కా నాగరాజు ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొడగట్టుపల్లికి చెందిన సాగి సుబ్బరాజు, సికింద్రాబాద్ లోని ఏఎస్ రావు నగర్ కు చెందిన కాపా శ్రీనివాస్, కర్నూలు జిల్లాకు చెందిన దుడుగురు కురబ గణేష్, సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రాజేంద్రనగర్ కు చెందిన ఉపేంద్రం కూడా అరెస్టయిన నిందితుల్లో ఉన్నారు.

నిందితుల్లో ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్:
ఈ కేసులోని మొత్తం పధ్నాలుగు మంది నిందితుల్లో సత్తుపల్లి మండలం గంగారంలోని టీజీఎస్పీ 15వ బెటాలియన్ లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న బేరా కేశవరావు, కానిస్టేుబుల్ ముల్లగిరి వర్దన్ లు ఏ4, ఏ2లుగా ఉన్నట్లు ఏసీపీ వసుంధర యాదవ్ చెప్పారు. మరో ఇద్దరు నిందితులు రామాంజనేయులు, రాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
అరెస్ట్ చేసిన నిందితుల నుంచి రూ. 17.60 లక్షల నగదు, రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, మరో టీవీఎస్ యాక్సెస్ స్కూటీ, 16 సెల్ ఫోన్లు, రెండు పోలీస్ యూనిఫాంలు, ఒక హ్యాండ్ కఫ్, ఒక ఎస్ఐ యూనిఫాం, ఆర్ఎస్ఐ యూనిఫాం, పోలీస్ నేం గల రెండు వైట్ టీ షర్లులు, రెండు పోలీస్ రెయిన్ కోట్లు, డమ్మీ చిల్డ్రన్ రూ. 500, 100 నోట్ల కరెన్సీకి సంబంధించిన 80 బండిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. నిందితులపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో Cr.No. 281/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 310(2), 318 (4)319(2), 204, 61(2) r/w 109 సెక్షన్ల కింద డెకాయిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు.

