చెన్నయ్: తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఏదైనా కుట్ర జరిగిందా? టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే, దానిని అస్థిరపరిచేందుకు జరిగినట్లు ఆరోపించబడుతున్న ఒక కుట్రను భగ్నం చేసినట్లు తమిళనాడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొనడం గమనార్హం.
ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15 మంది టీవీకే ఎమ్మెల్యేల చేత ఏకకాలంలో రాజీనామా చేయించేలా పథకం పన్నారని సమాచారం. టీవీకే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు చేపట్టి, ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో సంబంధాలు ఉన్నట్లు విచారణ సందర్భంగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మొదటి అరెస్టు చెన్నైలో జరగగా, మిగిలిన ఇద్దరిని కరూర్ నుండి అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్ర, దాని వెనుక ఉన్న విస్తృత నెట్‌వర్క్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యేకు రూ. 35 కోట్ల ఆఫర్: ఫిర్యాదు
ఉత్తంగరైకి చెందిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీవీకే నాయకుడు, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు, IPDS అనే కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఒక వ్యక్తి తనకు రూ. 35 కోట్లు ఆఫర్ చేశారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత తనను బెదిరించారని, ఈ ఆఫర్ గురించి ఎవరితోనూ చర్చించవద్దని చెప్పారని కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
టీఎంకేపై టీవీకే మంత్రి విమర్శలు:
ఈ కుట్ర ఆరోపణలపై తమిళనాడు మంత్రి సీటీ నిర్మల్ కుమార్ డీఎంకేను తీవ్రంగా విమర్శించారు. “సెంథిల్ బాలాజీతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులు, ‘కరూర్ గ్యాంగ్’గా పిలవబడే వర్గానికి చెందిన వారు ఈ వ్యవహారంలో నేరుగా ప్రమేయం కలిగి ఉన్నారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని, ఇందులో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేయాలి. ఇటువంటి దుర్మార్గపు కార్యకలాపాలకు వారు ముగింపు పలకాలి,” అని కుమార్ అన్నారు.
విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు AIADMK అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామితో డీఎంకే కుమ్మక్కైందని కూడా మంత్రి ఆరోపించారు. పార్టీ మారేందుకు పలువురు టీవీకే ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేశారని ఆయన ఆరోపించారు. “ఎడప్పాడి పళనిస్వామి, ఇతరులు అడ్డదారులు తొక్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేడు మనం దాని ఫలితాన్నే చూస్తున్నాం. ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి ఆదేశాల మేరకు, సెంథిల్ బాలాజీ వంటి కీలక డీఎంకే నేతలు మా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. వారు రూ. 10 కోట్లు, 20 కోట్లు లేదా 50 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేస్తున్నారు. వారు సంప్రదించని ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు,” అని కుమార్ ఆరోపించారు.
టీవీకే ఓ కథనాన్ని సృష్టిస్తోంది: డీఎంకే ఆరోపణ
కాగా ఈ పరిణామాలపై కొనసాగుతున్న దర్యాప్తు వివరాలను టీవీకే బయటపెడుతోందని డీఎంకే ఆరోపణలు చేసింది. “దర్యాప్తు వివరాలను లీక్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించాలని టీవీకే భావిస్తోంది. వారి దగ్గర వాస్తవాలు లేవని, కేవలం ఒక కథనాన్ని సృష్టించడమే వారి లక్ష్యమని ఇది స్పష్టం చేస్తోంది,” అని డీఎంకే అధికార ప్రతినిధి ఎ. శరవణన్ ఓ జాతీయ న్యూస్ ఛానల్ తో అన్నారు. సెంథిల్ బాలాజీకి వ్యతిరేకంగా పక్కా ఆధారాలు ఉంటే, ఆయనను అరెస్టు చేయాలని కూడా ఆయన టీవీకేకు సవాల్ విసిరారు.
ఇదిలా ఉండగా విజయ్, సెంథిల్ బాలాజీల మధ్య తీవ్రమైన వైరం ఉంది. మాజీ డీఎంకే మంత్రి అయిన బాలాజీ కరూర్ ప్రాంతానికి చెందిన నాయకుడు కావడం గమనార్హం. విజయ్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. తన పరువు తీయడానికే బాలాజీ కుట్ర పన్ని ఆ తొక్కిసలాటను సృష్టించారని అప్పట్లో విజయ్ ఆరోపించగా, బాలాజీ ఆయా ఆరోపణలను ఖండించారు.

