సత్తుపల్లి: తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘యాక్టర్’ కామెంట్ చేశారు. కమల్ హాసన్ ను మించిన యాక్టర్ గా అభివర్ణించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు నిర్వహించిన ‘ఎస్ఐఆర్’ అవగాహనా కార్యక్రమంలో కేటీఆర్ భట్టిని టార్గెట్ చేస్తూ ఆయా వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘మా భట్టి విక్రమార్క గారయితే కమల్ హాసన్‌ను మించిన యాక్టింగ్ చేశాడాయన. కమల్ హాసన్ గారిని మరిపించాడు. కమల్ హాసన్ సరిపోడు. ఇంకా పెద్ద యాక్టర్లు ఎవరూ సరిపోరు. ఎంత యాక్టింగబ్బబ్బబ్బా.. గుర్తుందా..? మధిరలో కార్డులు పట్టుకుని.. ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి. నూరు రోజులు గట్టిగ పెట్టుకోండి.. గట్టిగ దాచుకోండి గూట్లో… నూట ఒక్కటో రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒస్తారు. ఒచ్చీ.. ఆ కార్డులు తీసుకుని మీ ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి రూ. 2.50 లక్షలు ఇచ్చే బాధ్యత మాది అని.. ఆయనను నమ్మమేమో అని చెప్పీ.. తీసుకెళ్లి మళ్లీ బాండ్ పేపర్‌పై రాసి, దేవుని కాడ పెట్టి దండం పెట్టిన నాయకుడు భట్టి విక్రమార్క గారు’ అని కేటీఆర్ అన్నారు.
‘అయ్యా భట్టిగారూ.. నేనడుగుతున్నా మీ ఖమ్మం జిల్లా వేదికగానే. యాడ బెట్టుకోవాలే కార్డులిప్పుడు? భద్రంగా పెట్టుకోమంటివి కదా? యాడ బెట్టాల..? ఏం జెయ్యాలె నీ కార్డుల్ని? బొంద పెట్టాల్నా? సంవత్సరీకం చేయాలా? నీ గ్యారంటీ కార్డులకు, గ్యారంటీ గారడీకి ఏం సమాధానం చెప్తావని అడుగుతున్నా..’ అని కేటీఆర్ ప్రశ్నించారు. మరో ఇద్దరు మంత్రులైన తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపైనా కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

