Top 5 This Week

Related Posts

సీ ఫుడ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురి మృతి

చెన్నయ్: తమిళనాడులోని ఓ ప్రయివేట్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అమ్మోనియా గ్యాస్ భారీ ఎత్తున లీకై ఏడుగురు మృతి చెందగా, మరో 60 మంది వరకు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇప్పటి వరకు చనిపోయినవారంతా మహిళలే. తిరువళ్లూర్ జిల్లా పెరియపాళయం సమీపంలోని మంజంగరనై లో గల ఓ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

సంఘటన జరిగిన వెంటనే అస్వస్థతకు గురైన మొత్తం 67 మంది కార్మికులను స్థానిక వైద్య కేంద్రానికి తరలించినట్లు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎస్. కవిత వెల్లడించారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. 46 మంది వెల్స్ ఆసుపత్రిలోనూ, 21 మంది వెంకటేశ్వర ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. వీరిలో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న తొమ్మిది మందిని అంబులెన్స్‌ల ద్వారా చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.

తాము మొత్తం 44 మంది రోగులను చేర్చుకున్నామని, వీరిలో 43 మంది యువతులు, ఒక పురుషుడు ఉన్నారని వైద్యుడొకరు చెప్పారు. వీరిలో 15 నుండి 16 మందికి ఇంట్యూబేషన్ (శ్వాసనాళంలో గొట్టం అమర్చడం) చేశామని, ప్రస్తుతం 11 మంది వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నట్లు ఆయన విలేకరులతో చెప్పారు. అస్వస్థతకు గురైన ఆ 44 మందిలో అందరూ ఉత్తర భారతదేశానికి చెందిన వలస కార్మికులేనని సమాచారం.

బాధిత కార్మికులు చాలా చిన్న వయసువారని, ముఖ్యంగా 24 నుండి 25 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే ఎక్కువగా ఉన్నారని వైద్యుడు ఈ సందర్బంగా పేర్కొన్నారు. వారు ప్రాణాలతోనే ఉన్నారని, వారి నాడి, రక్తపోటును తాము పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం వారి బీపీ చాలా తక్కువగా నమోదవుతోందని, వారు చిన్న వయసువారు కాబట్టి, వారు కోలుకుంటారనే ఆశాభావంతో తాము ఉన్నట్లు చెప్పారు. అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న నలుగురైదుగురు రోగులను మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అని డాక్టర్ తెలిపారు.

విచారణకు సీఎం విజయ్ ఆదేశం:
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల్లోగా మధ్యంతర నివేదికను, 3 రోజుల్లో తుది నివేదికను సమర్పించేందుకు పారిశ్రామిక భద్రత, ఆరోగ్య శాఖ డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ అదనపు డైరెక్టర్‌తో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని, బాధితులకు సాధ్యమైనంత ఉత్తమ చికిత్స అందించేందుకు ఐటీ మంత్రి/తిరువళ్లూరు పర్యవేక్షణ మంత్రి, పర్యవేక్షణ అధికారి డాక్టర్ కె.పి. కార్తికేయన్, ఐఏఎస్‌తో కలిసి తిరువళ్లూరుకు వెంటనే వెళ్లాలని సీఎం విజయ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్డీ కవిత ఘటన జరిగిన ఫ్యాక్టరీ ప్రదేశాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఆసుపత్రుల్లో రోగులను కలిశారు.

Photo Credit: NDRF

Popular Articles