Top 5 This Week

Related Posts

ACB Raids: ‘సారు’ బెడ్డు కిందే రూ. 1.10 కోట్లు!

హైదరాబాద్: తెలంగాణా ల్యాండ్ అండ్ సర్వే డిపార్టుమెంటుకు చెందిన డిప్యూటీ డైెరెక్టర్ సుంకరి నరహరి రావు నిద్రించే బెడ్డు కింద రూ. 1.10 కోట్ల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసులో నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచీ తనిఖీలు నిర్వహిస్తున్న సందర్బంగా ఈ అంశం వెలుగు చూడడం విశేషం. హైదరాబాద్ ఛత్రినాకలోని నరహరి ఇంట్లోనేగాక, ఆఫీసు, అతని తమ్ముడి, బంధువులు, స్నేహితుల నివాసాలు సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.

ఆయా సోదాల్లో భాగంగా నరహరి అక్రమంగా ఆర్జించినట్లు భావిస్తున్న భారీ మొత్తపు ఆస్తులను ఏసీబీ అధికారుల గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని ల్యాండ్ డాక్యుమెంట్లతోపాటు, బంగారు ఆభరణాలను. నగదు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో నరహరికి సంబంధించిన రెండు విల్లాలను గుర్తించారు. అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను కూడా ఏసీబీ గుర్తించింది. నరహరికి చెందిన లాకర్లను ఓపెన్ చేయడానికి ఇప్పటికే ఏసీబీ అధికారులు బ్యాంకుకు వెళ్లారు. నరహరి ఇంట్లో భారీగా బంగారం లభ్యం కాగా, బ్యాంక్ లాకర్లలో మరింత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సోదాల్లో భాగంగా నరహరి సోదరుడి పేరుపైగల కొన్ని ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు నారాయణ గూడలోని సర్వే భవన్ లోని నరహరి క్యాబిన్ లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ గా నరహరి కీలక విధులు నిర్వహిస్తున్నాడు. భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనం వంటి కీలక ఉద్యోగ బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తున్నాడు,. అంతకు ముందు విధులు నిర్వహించిన విభాగంలోనూ నరహరి భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అనుమానిస్తోంది.

ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను ఏసీబీ మంగళవారం రాత్రి అధికారికంగా వెల్లడించింది. ల్యాండ్ అండ్ సర్వే డిపార్టుమెంటుకు చెందిన డిప్యూటీ డైెరెక్టర్ సుంకరి నరహరి రావును అరెస్ట్ చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఇవీ సోదాల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాలు:

  • రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు.
  • మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి.
  • పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో మూడు హై-రైజ్ ఫ్లాట్లు.
  • గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో, ఛత్రినాకలో జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ టూ భవనాలు.
  • రూ. 1.54 కోట్ల నగదు, రూ. 2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్.
  • రూ.5.04 కోట్ల ఫిక్సుడ్ డిపాజిట్లు.
  • 1.3 కిలోల బంగారం, 8.00 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు.
  • భార్య పేరున గల రెండు లాకర్ల గుర్తింపు, లగ్జరీ కార్లు.
  • గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ రూ. 13.05 కోట్లు.
  • బహిరంగ మార్కెట్ లో ఆయా ఆస్తుల విలువ భారీగా ఉంటుందని ఏసీబీ అధికారుల వెల్లడి.

కాగా ఏసీబీ జారీ చేసిన ప్రకటనను దిగువన చూడవచ్చు.

Popular Articles