ఖమ్మం: షెడ్యూల్డు ఏరియాలో నివసిస్తున్న గిరిజనేతర రైతులకు తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అమలులో గల 1/70 (భూ బదలాయింపు) చట్టం అంశంలో గిరిజనేతర రైతుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మంలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, షెడ్యూల్డు ఏరియాలో 1970కి ముందు పట్టాలు గల, క్లియర్ టైటిల్ ఉన్నటువంటివారి గిరిజనేతర భూముల రిజిస్ట్రేషన్లకు భూభారతిలో ఆప్షన్ ఉందని, చేసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అయితే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భూముల సమస్యను పరిష్కరించలేని సందర్భాలు రెండో కోణంలో ఉన్నట్లు తాను విన్నానని మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి సమస్యలను సాదా బైనామాల ప్రక్రియ పూర్తయ్యాక పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం పరిధిలో గల 1/70 చట్టాన్ని కదపకుండానే, షెడ్యూల్డు ఏరియాలో నివసిస్తున్న గిరిజనేతర రైతులకు రక్షణ కల్పించనున్నట్లు మంత్రి చెప్పారు. తరతరాలుగా వస్తున్న వారివారి ఆస్తులను గిరిజనేతరులు రక్షించుకునే విధంగా ఎలా చేయాలనే అంశంపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రకం (శిస్తు) రశీదులు ప్రామాణికంగా భద్రత ఉంటుందని, తద్వారా షెడ్యూల్డు, నాన్ షెడ్యూల్డు ఏరియాల్లోని భూములకు కూడా పరిష్కారం లభిస్తుందన్నారు.
ఏ ఆధారం, ఏ కాగితమూ లేని భూముల అంశంలో కొందరు రైతులు నిత్యం అభద్రతతో జీవిస్తున్నారని, నామమాత్రపు రుసుముతో ఇటువంటి సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఇటువంటి అంశాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలను తీసుకువచ్చాయని, వాటిని ఇప్పుడే బహిర్గతం చేయలేమన్నారు. ఈ అంశంలో ఓ ముగింపునకు వచ్చాక, అవసరమైతే అసెంబ్లీలో చర్చ జరిపి ఆయా పాలసీలను ఇక్కడా అమలు చేయబోతున్నట్లు వ్యక్తిగతంగానేగాక, ప్రభుత్వంపరంగానూ తాను చెప్పదల్చుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

