Top 5 This Week

Related Posts

పొంగులేటి ఆగ్రహం.. డిప్యూటీ కలెక్టర్ సహా ఇద్దరి సస్పెన్షన్, మరొకరు డిస్మిస్

హైదరాబాద్: కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి సహా పలువురు అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సహా ఇద్దరు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. మరొకరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఇదే ఘటనలో సబ్ రిజిస్ట్రార్ల పాత్రపైనా విచారణకు ఆదేశించారు. తెలంగాణా హౌజింగ్ బోర్డుకు చెందిన అత్యంత విలువైన స్థలాన్ని డిప్యూటీ కలెక్టర్ రామునాయక్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడనేది ప్రధాన అభియోగం. ఇందుకు మరికొందరు అధికారులు సహకరించారనే ఆరోపణల నేపథ్యం. ఈ ఘటనకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారులే ఆనాటి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ భూములను కొల్లగొట్టార‌ని, అటువంటి వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఈ సందర్భంగా స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ భూములను అంగుళం ఆక్రమించేందుకు ప్రయత్నించినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చ‌రించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే వాటిని దోచుకునే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన మండిపడ్డారు.

ప్ర‌స్తుతం రెవెన్యూ శాఖ‌లో డిప్యూటీ క‌లెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న రాము నాయక్ 2013 నుంచి 2018 వ‌ర‌కు డిప్యూటేష‌న్‌పై హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారని చెప్పారు. ఈ స‌మ‌యంలో అనేక‌ భూ దందాల‌కు, అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల‌కు పాల్ప‌డిన‌ట్లు ప్రాధ‌మికంగా నిర్ధార‌ణ కావ‌డంతో త‌క్ష‌ణ‌మే రామునాయిక్‌ను సస్పెండ్ చేస్తున్న‌ట్లు మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్, క్యూర్ ప‌రిధిలో పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధ‌లాల గుర్తింపు కోసం హౌసింగ్ బోర్డు భూముల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో రాము నాయిక్ భూలీలలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని మంత్రి తెలిపారు

బ‌హిరంగ మార్కెట్లో గ‌జం రెండు ల‌క్ష‌ల రూపాయిల‌కు పైగా విలువ చేసే హైకోర్టు 5-6 గేట్ల మ‌ధ్య ఉన్న తెలంగాణ‌ హౌసింగ్ బోర్డు కు చెందిన 33.53 చ‌ద‌ర‌పు గ‌జాల‌ స్ద‌లాన్ని రాము నాయిక్ 2018 ఫిబ్రవ‌రి 17న అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్లు బ‌య‌ట‌ప‌డిందన్నారు. దీనిపై లోతైన విచార‌ణ జ‌రుప‌గా రాము నాయిక్ భూదందాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు.

గ‌తంలో హౌసింగ్ బోర్డులో వ‌ర్క్ ఇన్స్‌పెక్ట‌ర్‌ గా ప‌నిచేసి ఉద్యోగం నుంచి తొల‌గింప‌బ‌డిన‌ ఇఫ్తాక‌ర్ అహ్మ‌ద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఈ భూమిని రాము నాయక్ అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించినా, ఆయా డ‌బ్బులు కూడా నేటి వ‌ర‌కు బోర్డుకు జ‌మ‌కాలేదన్నారు. కాల‌క్ర‌మంలో నిరుడు ఏప్రిల్లో ఈ భూమిని సుబియా సుల్తానా మ‌రొక‌రికి విక్ర‌యించారని చెప్పారు. ఈ భూమికి సంబంధించిన ప‌త్రాల‌ను బోర్డు అనుమ‌తుల‌ను ప‌రిశీలించ‌కుండా రిజిస్ట్రేష‌న్ చేసిన అప్పటి చార్మినార్ స‌బ్ రిజిస్ట్రార్ పై కూడా విచార‌ణ‌కు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై కూడా ప్ర‌భుత్వ ప‌రంగా త‌గిన విచార‌ణ జ‌రిపిస్తున్నామ‌ని, తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా రాము నాయిక్ అక్ర‌మాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని వివరించారు.

కాగా రాము నాయిక్ భూ అక్ర‌మాల‌కు స‌హ‌క‌రించిన సూప‌రింటెండెంట్ వివేకానంద్ రిటైర్మెంట్ మ‌రో ప‌ది సంవ‌త్స‌రాలు ఉండ‌గానే విధుల నుంచి శాశ్వ‌తంగా తొల‌గించామ‌ని చెప్పారు. మ‌రో సూప‌రింటెండెంట్ బోనా నాయిక్‌ను సస్పెండ్ చేశామన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వ్యక్తులే వాటిని దోచుకునే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన ఆగ్రహించారు.

ప్రభుత్వ భూములపై కన్నేసిన వారెవ్వరినీ వదిలిపెట్టమని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. వారు ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను కబ్జా చేయాలనే దురాలోచనతో వ్యవహరించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో అక్రమాలకు పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులను కబ్జా చేయాలనే దురాలోచనతో వ్యవహరించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటాం.

ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు, నకిలీ పత్రాలు సృష్టించేందుకు లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టే అధికారులకు ప్రభుత్వ సర్వీసులో కొనసాగే అర్హత లేదన్నారు. ఇలాంటి వారిని గుర్తించి శాశ్వతంగా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆస్తులను దోచుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదన్నారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ ప్రథమ బాధ్యతగా మంత్రి స్పష్టం చేశారు. భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అధికార దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. తప్పు చేసిన వారెవరైనా చట్ట ప్రకారం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి హెచ్చరించారు.

Popular Articles