Top 5 This Week

Related Posts

రాజకీయాల్లో చివరి తీర్పు ఎప్పుడూ మొబైల్ స్క్రీన్‌పై రాదు!

క్లిక్ కీ.. ఓటుకీ మధ్య..!
ఒక యూట్యూబ్ ఛానల్,
కొన్ని వైరల్ వీడియోలు,
లక్షల ఫాలోవర్లు,
వేల కామెంట్లు,
ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు
వీటితో రాజకీయ శక్తిగా మారవచ్చా?

‘కాక్రోచ్ జనతా పార్టీ’ వంటి సోషల్ మీడియా ఆధారిత రాజకీయ ప్రయోగాల భవిష్యత్‌పై ఇటువంటి చర్చ సహజమే కాదు అవసరం కూడా!

నిజానికి సోషల్ మీడియా ఈ రోజుల్లో అత్యంత శక్తివంతమైన రాజకీయ ఆయుధం. అది ఒక అంశాన్ని క్షణాల్లో దేశవ్యాప్త చర్చగా మార్చగలదు. అధికారంలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టగలదు. ప్రతిపక్షాలను బలోపేతం చేయగలదు. ప్రజల ఆగ్రహాన్ని అగ్నిపర్వతంలా పేల్చగలదు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉంది.

సోషల్ మీడియాలో మొదలైన యుద్ధం నిజంగా పోలింగ్ బూత్ దగ్గర కూడా గెలుస్తుందా?

రాజకీయ చరిత్ర చెబుతున్న సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది. సోషల్ మీడియాలో చప్పట్లు కొట్టేవారంతా ఓటర్లు కారు. ఓటర్లంతా సోషల్ మీడియాలో ఉండరు. ఒక వీడియోకు పది లక్షల వ్యూస్ రావచ్చు. కానీ ఆ వీడియో చూసిన వారిలో ఎంతమంది ఎన్నికల రోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేస్తారు అనేదే అసలు రాజకీయ గణితం.

ఒక పోస్టుతో ప్రజల్లో ఆవేశం రగిలించవచ్చు. ఒక ప్రసంగంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చు. కానీ ఎన్నికల రోజు ప్రతి బూత్ వద్ద ఓటర్ని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లేది సోషల్ మీడియా కాదు. క్షేత్రస్థాయి సంస్థాగత బలం.

ప్రపంచ రాజకీయాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 2010-11లో అరబ్ స్ప్రింగ్ ఉద్యమం సోషల్ మీడియా విప్లవానికి ప్రతీకగా నిలిచింది. ప్రభుత్వాలపై తిరుగుబాట్లకు వేదిక అయింది. కానీ ఆ ఉద్యమాల్లో చాలా వరకు తర్వాత స్థిరమైన రాజకీయ ప్రత్యామ్నాయాలుగా నిలవలేకపోయాయి. కారణం ఒకటే. ఆగ్రహాన్ని ఉద్యమంగా మార్చడం సులభం. ఉద్యమాన్ని పాలనా వ్యవస్థగా మార్చడం కష్టం.

మన రాజకీయాలు మరింత సంక్లిష్టమైనవి. ఇక్కడ ఎన్నికలు కేవలం ప్రభుత్వ వ్యతిరేకతతో గెలవవు. సామాజిక సమీకరణలు, స్థానిక నాయకత్వం, కులాలు, ప్రాంతీయ అంశాలు, అభ్యర్థి వ్యక్తిత్వం, సంక్షేమ పథకాల ప్రభావం, కేడర్ శక్తి…ఇలా ఎన్నో అంశాలు కలిసి ఫలితాన్ని నిర్ణయిస్తాయి. సోషల్ మీడియా వీటిలో ఒక అంశం మాత్రమే. మొత్తం సమీకరణ కాదు.

ప్రజలు నిరసనను కొంతకాలం ఆస్వాదిస్తారు. ప్రత్యామ్నాయాన్ని మాత్రం చాలా కాలం పరిశీలిస్తారు. అందుకే అధికారాన్ని విమర్శించడం కంటే అధికారానికి ప్రత్యామ్నాయం కావడం కష్టమైన పని.

కాక్రోచ్ పార్టీ వంటి వేదికల ముందు కూడా ఇదే సవాలు ఉంది. సోషల్ మీడియాలో సృష్టించిన సంచలనాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లగలరా? కామెంట్ సెక్షన్‌లో కనిపించే మద్దతును ఓట్లుగా మార్చగలరా? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినంత బలంగా తమ పాలనా నమూనాను ప్రజలకు వివరించగలరా?

సోషల్ మీడియా ఒక మైక్రోఫోన్. అది స్వరాన్ని పెంచుతుంది. కానీ అది సంస్థను నిర్మించదు. అది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ ఓటర్ని పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లదు. అది ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టగలదు. కానీ ఒంటరిగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయదు.

చరిత్రలో నిలిచిపోయిన రాజకీయ పార్టీలు అన్నీ ఒకే మార్గంలో ప్రయాణించాయి. మొదట ప్రజల భావోద్వేగాన్ని అందుకున్నాయి. తర్వాత సంస్థాగత బలాన్ని నిర్మించాయి. చివరకు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాయి. ఈ మూడు మెట్లు ఎక్కకుండా కేవలం వైరల్ వీడియోల ఆధారంగా అధికారానికి చేరుకున్న ఉదాహరణ ప్రపంచ రాజకీయాల్లో దాదాపుగా లేదు.

అందుకే సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య చూసి రాజకీయ భవిష్యత్తును అంచనా వేయడం తొందరపాటు. ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు ఎన్నికల ఫలితాలు కావు. వైరల్ వీడియోలు ఓట్ల పెట్టెలు కావు. కామెంట్లలో కనిపించే కోపం బ్యాలెట్ పేపర్ మీద కనిపించాల్సిందే అనే గ్యారంటీ లేదు.

కాబట్టి కాక్రోచ్ పార్టీ భవిష్యత్తు సోషల్ మీడియాలో కాదు, సోషల్ మీడియా దాటి నిర్మించగలిగే రాజకీయ వ్యవస్థలో ఉంది. ఫాలోవర్లను కార్యకర్తలుగా, కార్యకర్తలను కేడర్‌గా, కేడర్‌ను ఓట్లుగా మార్చగలిగితే అది రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. లేకపోతే మరో వైరల్ సంచలనంగా చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది.

రాజకీయాల్లో మార్పు అనివార్యం.. అయితే మార్పుని సాధించే మార్గం ఏమిటననేది అసలు సవాలు.

రాజకీయాల్లో చివరి తీర్పు ఎప్పుడూ మొబైల్ స్క్రీన్‌పై రాదు. అది ఓటింగ్ యంత్రం దగ్గరే వస్తుంది. అక్కడ లైక్‌లకు విలువ లేదు. షేర్‌లకు ప్రాధాన్యం లేదు. ఫాలోవర్ల సంఖ్యకు అర్థం లేదు. స్క్రీన్ మీద చేసే క్లిక్ కీ.. పోలింగ్ బూత్ లో పడే ఓటుకీ మధ్య రాజకీయంగా కొలవలేనంత దూరం ఉంటుంది.

Popular Articles