Top 5 This Week

Related Posts

అలా జరిగితే ఎన్నికల్లో పోటీ చేయను.. రెడీనా?: కేటీఆర్ కు పొంగులేటి సంచలన సవాల్

హైదరాబాద్: తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంచలన సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇండ్లకంటే అయిదేళ్లలో తమ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లను పేదల కోసం నిర్మించకపోతే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని పొంగులేటి కేటీఆర్ ను ఉద్ధేశించి సవాల్ చేశారు. ‘మా ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలోకంటే ఎక్కువ ఇండ్లను నిర్మిస్తే నువ్వు శాసనసభ్యునిగా పోటీ చేయవద్దు.. సవాల్ కు సిద్ధమా? అని డ్రామారావును అడుగుతున్నా..’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని నాంపల్లి, మలక్‌పేట్, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనువైన ఖాళీ స్థలాలను, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవన సముదాయాలను సహచర మంత్రి అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ , స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి పొంగులేటి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ పరిధిలో 46 వేల ఇండ్లు అరకొర వసతులతో కడితే దానిలో 16 వేల మంది అక్కడ నివాసం ఉండటం లేదన్నారు. తమ జీవనోపాధికి దూరంగా ఇండ్లు ఉన్నాయనే కారణంతో పేదలు అక్కడ నివసించడం లేదని, ఈ విధంగా చిత్తశుద్ది లేకుండా ఇష్టారీతిన ఇండ్లు కట్టి వారేదో గొప్పలు చేసినట్టు చెప్తున్న మాజీ మంత్రి కేటిఆర్ కు తాను నేరుగా ఈ సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. హైదారాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో కట్టిన ఇండ్ల సంఖ్య కంటే అయిదేళ్లలో తమ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు కట్టకపోతే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు.

Popular Articles