Top 5 This Week

Related Posts

టోకరా రాయుడి ‘కత’లో.. అది జర్నలిజమా..? దొంగతనమా!?

“కోలా”హలంగా ముగిసిన ఒక అధ్యాయం!

ఒక హెడ్డింగ్ కోసం… దొంగల్లా వెళ్ళాం.

చివరికి… అదే హెడ్డింగ్ ఒక మనిషిని దొంగగా నిలబెట్టింది.

1998… నవంబర్ 13.

రాత్రి పది గంటలు.

విజయవాడలోని “వార్త” సిటీ ఆఫీస్.

న్యూస్‌రూమ్ కొంచెం నిశ్శబ్దంగా మారుతున్న టైమ్.

అప్పుడే ఫోన్ మోగింది.

ఆ టైంలో ఎడిషన్ ఇన్‌చార్జి నుంచి కాల్.

“అర్జెంట్‌గా ప్రెస్ క్లబ్‌కి వచ్చేయ్…”

అంతే. ఫోన్ కట్.

నేను… ఫోటోగ్రాఫర్…

ఇద్దరం వెంటనే ప్రెస్ క్లబ్‌కి చేరుకున్నాం.

ఎడిషన్ ఇంచార్జ్ ముఖంలో ఓ స్పష్టమైన ఆత్రుత కనిపించింది.

“ఇప్పుడే ఆంధ్రజ్యోతి డెస్క్ ఇంచార్జి చెప్పాడు… రేపు విజయవాడ డేట్‌లైన్ నుంచి ఒక పెద్ద సెన్సేషన్ వార్త వస్తుందట. మీరు వెంటనే రైల్వే స్టేషన్‌కి వెళ్లండి. మాఫిషల్ ఎడిషన్ ప్రింట్స్ వస్తాయి… ఫస్ట్ పేజీ చూడండి.”

ఆ మాటల్లో ఉన్న అత్యవసరం… మాకు కూడా పట్టుకుంది.

ఇప్పుడు లాగా వాట్సాప్, పీడీఎఫ్‌లు, డిజిటల్ ఎడిషన్లు లేని కాలం అది.

అప్పుడు పత్రికలు రాత్రి రైళ్లలో పార్సిల్‌లా పంపించేవారు.

రాత్రికి రాత్రే… కట్టలుగా స్టేషన్లకు చేరేవి.

అప్పటికే రాత్రి 11 దాటింది.

మేము విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాం.

ప్లాట్‌ఫారం నెంబర్ 1…

పార్సిల్ రూమ్ దగ్గర… ఆంధ్రజ్యోతి పత్రిక కట్టలు.

అక్కడే…మా కథలో మొదటి “దొంగతనం” మొదలైంది.

చుట్టూ ఎవరూ చూడట్లేదని చూసుకుని…

ఒక కట్ట మెల్లగా తెరిచాం.

గుండె వేగంగా కొడుతోంది.

పేపర్ ఓపెన్ చేశాం…

కానీ పూర్తిగా చదవలేకపోయాం.

అన్ని స్పష్టంగా కనిపించలేదు.

కేవలం ఒక హెడ్డింగ్ మాత్రమే కంటపడింది—

“విజయవాడకు చెందిన కోలా కృష్ణమోహన్‌కు 84 కోట్ల యూరో లాటరీ”

అంతే.

ఒక్క లైన్.

అదే మా దగ్గరున్న మొత్తం సమాచారం.

అయినా…

ఆ ఒక్క లైన్‌తోనే మేము తిరిగి వచ్చేశాం.

వెంటనే ఆటోనగర్ ఎడిషన్ సెంటర్‌కి ఫోన్ చేసి…

ఆ హెడ్డింగ్ ఆధారంగా వార్త డిక్టేట్ చేశాను.

గోపీచంద్ ముందే చెప్పి ఉండటంతో…

మా ఇన్‌పుట్ ఆధారంగా…

చిన్న సింగిల్ కాలమ్ …విజయవాడ ఎడిషన్‌లో ప్రచురించారు.

మరుసటి రోజు…

ఉదయం 6 గంటలు.

మా ఇంటి ల్యాండ్‌లైన్ గట్టిగా మోగింది.

ఆ కాల్… గిరీష్ సంఘీ నుంచి.

ఆయన ప్రేమ ఎంత బలంగా ఉంటుందో… కోపం అంతకంటే ఎక్కువ.

“ఎందుకు మనం మిస్ అయ్యాము ?” అన్న స్వరం లోనే ఆవేశం కనిపించింది.

అదృష్టవశాత్తూ… ఆ వార్త విజయవాడ ఎడిషన్‌కే పరిమితం అయిందని చెప్పి…

ఆయన్ని కాస్త శాంతింపజేశాను.

“సరే… కోలా ఇంటర్వ్యూ తీసుకో. మనకే ప్రత్యేకంగా ఉండాలి,” అన్నారు.

మరుసటి ఉదయం…

విజయవాడ విద్యాధరపురంలో ఉన్న కోలా ఇంటికి వెళ్లాం.

ఒక చిన్న టూ బెడ్‌రూమ్ ఫ్లాట్…

కానీ ఆ రోజు అది సెలబ్రిటీ హౌస్ అయిపోయింది.

లోపలికి వెళ్లే వాళ్లు… బయటికి వచ్చే వాళ్లు…

అభినందనలు… సందడి…

ఒక రాత్రిలోనే జీవితం మారిపోయిన మనిషి.

మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం.

బాగానే ప్రచారం చేసాం.

కానీ కథ అక్కడితో ఆగలేదు.

కొత్త ట్విస్ట్ మొదలైంది.

రాజకీయ పార్టీల దృష్టి కోలాపై పడింది.

గిరీష్ సంఘీ… ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

అంతలో…విజయవాడలో సంఘీ ఇండస్ట్రీ కొత్తగా ప్రారంభించిన “లారీలకు జీపీఎస్” కార్యక్రమానికి కోలాను ముఖ్య అతిథిగా పిలవమని నాకు ఆదేశం.

లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్‌లో గ్రాండ్ ఏర్పాట్లు.

అన్నీ సెట్.

కానీ… ఇంతలో కోలా ఒక్కసారిగా మచిలీపట్నం వెళ్లి

“నేను తెలుగుదేశం తరఫున పార్లమెంట్‌కు పోటీ చేస్తున్నాను.” అని ప్రకటించారు.

ఆ వార్తను మేము పంపిన హెడ్డింగ్…

“బందరు లడ్డు… నాదే!”

ఒక లైన్… కానీ చాలా అర్థాలు.

ఇక్కడి నుంచి వాతావరణం మారిపోయింది.

కోలా నిర్ణయం… గిరీష్ సంఘీకి నచ్చలేదు.

గిరీష్‌కు నచ్చకపోతే…

ఆ సంస్థలో పని చేసే నాకూ నచ్చనట్టే.

అదే అప్పుడు జర్నలిజం.

ఇప్పటికీ అదేనెమో!

కొన్ని రోజులకు…

ఒక ఉదయం నేను మాచవరం ఆంధ్ర బ్యాంక్‌కి వెళ్లాను.

మేనేజర్ నాకు పరిచయం.

సాధారణంగా నేరుగా లోపలికి వెళ్లే ఫ్రీడమ్ ఉంది.

కానీ ఆ రోజు…ఆయన ఛాంబర్‌లో ఎవరో ఉన్నారు.

చర్చలు గంభీరంగా సాగుతున్నాయి.

నన్ను బయటే ఉండమని సంకేతం ఇచ్చారు.

దాదాపు అరగంట తర్వాత…

లోపల ఉన్నవాళ్లు బయటికి వెళ్లారు.

నేను లోపలికి వెళ్లాను.

కొన్ని మాటల తర్వాత…

ఆయన ఒక విషయం చెప్పాడు.

అది… మొత్తం కథనే తలకిందులు చేసింది.

కోలా… ఒక ఫైనాన్సియర్ దగ్గర 10 రూపాయల వడ్డీకి 50 లక్షలు తీసుకున్నాడు. లాటరీ డబ్బు రాగానే ఇస్తా అని చెక్ ఇచ్చాడు.

కానీ… చెక్ బౌన్స్ అయింది. అదీ పంచాయితీ అన్నారు.

ఆఫీస్‌కి వెళ్లి వెంటనే ఒక వార్త రాశాను.

“లక్ష్మీపుత్రుడా… టోకరా రాయుడా?” అనే హెడ్డింగ్ కానీ…

ఆ వార్తలో కోలా పేరు రాయలేదు.

కొద్దిసేపటికి గిరీష్ సంఘీ నుంచి ఫోన్.

“సరిగ్గా కన్ఫర్మ్ చేసుకున్నావా?”

“బ్యాంక్‌లోనే తెలుసుకున్నాను…” అన్నాను.

మరుసటి రోజు… అదే బ్యానర్ ఐటమ్‌.

వెంటనే కేసులు, అరెస్టు చక చకా జరిగిపోయాయి.

ఒకప్పుడు మేము దొంగల్లా చూసిన ఒక హెడ్డింగ్…

చివరికి అదే మనిషిని సమాజం ముందు “దొంగ”గా నిలబెట్టే వార్తగా మారింది.

ఇన్నేళ్లు గడిచినా… ఆ రోజు ఇంకా నన్ను వెంటాడుతుంది.

నేను చేసినది… నిజంగా జర్నలిజమా?

లేక… దొంగతనమా?

కొన్ని కథలు మాత్రం, చదివేవాళ్ల కోసం కాదు…

మనసులో మిగిలే ప్రశ్నల కోసం పుడతాయి.

Popular Articles