ప్రాణాంతక ఎబోలా వైరస్ మళ్లీ వెలుగు చూసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయి. బుండిబుగ్యో వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే 80 మంది ప్రాణాలు కోల్పోగా, 246 అనుమానిత కేసులు నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ దేశాలకు ఇప్పటికిప్పుడు ముప్పు లేకపోయినా, కాంగో వంటి పొరుగు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
బుండిబుగ్యో వైరస్ ఎబోలా వ్యాధిని కలిగించే మూడు రకాల వైరస్ లలో ఒకటని, ఇది అత్యంత అరుదైనదిగా పేర్కొంది. ఈ రకానికి ఆమోదించబడిన టీకాలుగాని, చికిత్సలుగాని, నిర్దిష్ట పరీక్షలుగానీ ఏవీ లేవని తెలిపింది. ఎబోలాను తీవ్రమైన అంటువ్యాధిగా, రక్తం, వాంతుల వంటి శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. ఆఫ్రికాలోని వ్యాధి నియంత్రణ కేంద్రాలు ఈ వైరస్ వ్యాప్తి గురించి శుక్రవారం బహిరంగంగా ప్రకటించాయి. అయితే వ్యాధి ఎప్పుడు మొదలైందనేది స్పష్టంగా తెలియదని ఆఫ్రికా సీడీసీ కేంద్రాలు చెప్పాయి.
దేశానికి తూర్పున, ఉగాండా, దక్షిన సూడాన్ ల సరిహద్దుల్లో, రాజధాని నుంచి సుమారు ఐదురోజుల ప్రయాణపు దూరంలో గల డీఆర్సీ ఇటూరి ప్రావిన్స్ లో 80 అనుమానిత మరణాలు, ఎనిమిది ప్రయోగభాలల్లో నిర్ధారించిన 246 అనుమానిత కేసులు నమోదయ్యాయి. డీఆర్సీ నుంచి ప్రయాణించిన వ్యక్తుల్లో ఉగాండా రాజధాని కంపాలలో ఒకరి మరణం సహా రెండు కేసులు కూడా నమోదయ్యాయి.
డీఆర్సీ రాజధాని కిన్షాసాలో మరో కేసు నిర్ధారణ జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి వైరస్ సోకిన వ్యక్తుల నిజమైన సంఖ్య, భౌగోళిక వ్యాప్తిపై గణనీయమైన అనిశ్ఛితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలపడం గమనార్హం. ఎబోలా వైరస్ ను కాంగోలో 1976లో గుర్తించారని, వ్యాప్తి చెందడం ఇది 17వసారిగా తెలిపింది. వ్యాధి నిర్ధారణ జరిగినవారిని క్వారంటైన్ కు పంపి, వారితో సంబంధం గల వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కాంగో దేశానికి సూచించింది.
అదేవిధంగా సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని, ప్రయాణ, వాణిజ్య ఆంక్షలను విధించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.
(Source: English media outlets)

