జర్నలిజం విశ్వవేదికపై జెండా ఎగరేసిన ఈ ఇద్దరు ఇండియన్స్ సాహస గాథ ఇది..
భారతీయ జర్నలిజం బోలెడంత భ్రష్టుపట్టిందని, సెంటీమీటర్ల లెక్కన లైన్ అకౌంట్ తీసుకునే గ్రామీణ విలేఖరులు తెల్లారేపాటికి అదానీలు, అంబానీలుగా మారుతున్నారని, కొత్తగా గొట్టాలు పట్టిన వారు దావూద్ ఇబ్రహీంలను మించి పోతున్నారనుకునే ‘సత్ జనులకు’ ఈ వార్త మింగుడు పడకపోవచ్చు గానీ… ఇది తమిళనాడులో నటుడు విజయ్ గెలిచినంత పచ్చి నిజం. జర్నలిజం విశ్వవేదికపై మన వాళ్లూ జెండా ఎగరేశారు. జర్నలిజానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించడంలో తామెవ్వరికీ తీసిపోమని గట్టిగానే ఢంకా భజాయించి చెప్పారు.
జర్నలిజంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు పులిట్జర్. దీన్ని మనవాళ్లు గెల్చారు. వాళ్లే సుపర్ణా శర్మ, ఆనంద్ ఆర్.కె.
ఇంతకీ వీళ్లు ఎవరు? ఎక్కడి వాళ్లు, వాళ్లు సాధించిన ఘనతేమిటీ?
ఏ ఫిక్షనో, నాన్ ఫిక్షన్ విభాగంలోనో మన వాళ్లు ఈ అవార్డు గెలవలేదు.. సాక్షాత్తూ పరిశోధనాత్మక జర్నలిజంలో గెలిచారు. ఎప్పుడో 1937లో సైన్స్ రిపోర్టింగ్ లో మన జర్నలిస్టు ఒకరు ఈ అవార్డు గెలిస్తే ఇప్పుడు మనవాళ్లు ఇద్దరు గెలిచారు. భారతీయ జర్నలిజం చరిత్రలో ఇదో మైలురాయి. ఆనంద్ ఆర్.కె., సుపర్ణా శర్మ అనే ఇద్దరు భారతీయులు ‘బ్లూమ్‌బెర్గ్’ కోసం ఓ కథనం చేశారు. దాని పేరు “trAPPed”. ఇదో పరిశోధనాత్మక కథనం. పులిట్జర్ అవార్డు నిర్ణేతలు- Illustrated Reporting and Commentary- విభాగంలో వీరిని ఎంపిక చేశారు. వీరిద్దరూ బ్లూమ్‌బెర్గ్ సీనియర్ రిపోర్టర్ నటాలీ ఒబికో పియర్సన్తో కలిసి ఈ అవార్డును అందుకోనున్నారు.

ఏమిటీ రిపోర్ట్?
“trAPPed” అనే ఈ రిపోర్ట్ ఓ సాదాసీదా భారతీయ మహిళ జీవనానికి సంబంధించింది. లక్నోకు చెందిన న్యూరాలజిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఓ రోజు సాయంత్రం ఆమెకి వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో జీవితం ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. “డిజిటల్ అరెస్ట్” అనే కొత్త రకం మోసం ఆమె బతుకును దుర్భరం చేస్తుంది. ఏమి చేయాలో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటుంది. సైబర్ నేరగాళ్లు ఫోన్ లోనే ఎలా భయపెట్టి, బంధించి, ఆమె ఖాతాల నుంచి డబ్బులు కాజేశారనే అంశాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రాలతో (Visual Storytelling) వివరించారు. సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు చేస్తుంది. మరింత మంది సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఈ రిపోర్ట్ ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపుతుంది.
ఎవరీ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె., సుపర్ణా శర్మ..?
ఆనంద్ ఆర్.కె. ముంబైకి చెందిన ప్రముఖ ఇలస్ట్రేటర్. గ్రాఫిక్ నవలల్లో దిట్ట. Blue in Green, Grafity’s Wall అనేవి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చాయి. ఇప్పటికే 2021లో Eisner Award (కామిక్స్ రంగం) కూడా గెలుచుకున్నారు.
సుపర్ణా శర్మ ఢిల్లీకి చెందిన అనుభవజ్ఞులైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె క్రైమ్, కరప్షన్, సామాజిక సమస్యలపై లోతైన రిపోర్టింగ్ చేస్తుంటారు.

అవార్డు ప్రాముఖ్యత..
పులిట్జర్ అవార్డ్ జర్నలిజం రంగంలో ప్రపంచ స్థాయి అత్యున్నత గౌరవం. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ విభాగంలో భారతీయులు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ రిపోర్ట్ డిజిటల్ యుగంలో మనం ఎదుర్కొంటున్న కొత్త తరం మోసాలు, నిఘా సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది.
ఈ అవార్డు రావడంపై సుపర్ణా శర్మ మాట్లాడుతూ.. “ఈ రిపోర్ట్ ఒక వ్యక్తి బాధ.. ఒక్క ఫోన్ కాల్ ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించడానికి ప్రయత్నించింది. ఇది మన అందరి కథ కావచ్చు” అన్నారు.
ఆనంద్ ఆర్.కె. ఈ అవార్డ్‌ను భారతీయ యువ జర్నలిస్టులు, ఇలస్ట్రేటర్లకు ప్రోత్సాహంగా అభివర్ణించారు.
ఇది కేవలం ఇద్దరు జర్నలిస్టుల విజయం కాదు. ఇది భారతీయ జర్నలిజం సామర్థ్యానికి, సాహసానికి, కథ చెప్పే విధానానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు.
గతంలో పులిట్జర్ గెలిచిన ఇండియన్స్ లో..
జర్నలిజం, సాహిత్య రంగాల్లో గతంలో కూడా పలువురు భారతీయులు లేదా భారత సంతతి వ్యక్తులు ఈ అవార్డును గెలుచుకున్నారు.
గోవింద్ బిహారీ లాల్ (1937): పులిట్జర్ పొందిన మొదటి భారతీయుడు. సైన్స్ రిపోర్టింగ్ విభాగంలో ఈయనకు అవార్డు దక్కింది.
ఝుంపా లాహిరి (2000): ఫిక్షన్ విభాగంలో ‘ఇంటర్ప్రెటర్ ఆఫ్ మలాడీస్’ పుస్తకానికి గానూ ఈమెకు అవార్డు వచ్చింది.
గీతా ఆనంద్ (2003): వాల్ స్ట్రీట్ జర్నల్ తరపున ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్‌లో అవార్డు సాధించారు.
సిద్ధార్థ ముఖర్జీ (2011): ‘ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్’ అనే పుస్తకానికి జనరల్ నాన్-ఫిక్షన్ కేటగిరీలో ఈయనకు గౌరవం దక్కింది.
అద్నాన్ అబిదీ, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ దవే (2022): కోవిడ్ సమయంలో తీసిన ఫోటోలకు గానూ ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో అవార్డు గెలుచుకున్నారు.
ఈ విజయం భారతీయ జర్నలిజం స్థాయిని, అంతర్జాతీయ వేదికలపై మన వారు చేస్తున్న పరిశోధనాత్మక కృషిని మరోసారి చాటిచెప్పింది.

✍️ ఆకుల అమరయ్య
సీనియర్ జర్నలిస్ట్

