Top 5 This Week

Related Posts

ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి, తీరిన పెట్రోల్, డీజిల్ కొరత

హైదరాబాద్: బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కృషి ఫలించింది. గడచిన రెండు రోజులుగా సరఫరా లేక, బంకులు మూతపడటంతో ఏర్పడ్డ పెట్రోల్, డీజిల్ కొరత సమసిపోయింది. పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవ ఫలితంగా తెలంగాణా జిల్లాల్లో 24 గంటల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరత సమస్యకు ఊరట లభించింది.

ఆయిల్ సరఫరా కంపెనీలైన బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్ పీసీఎల్ ఉన్నతాధికారులతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయిల్ ట్యాంకర్లను రిటైల్ అవుట్ లెట్లకు తక్షణమే పంపి కొరతను నివారించాలని ఆయన చేసిన సూచన మేరకు ఆయా కంపెనీలు స్పందించి సరఫరాను వేగవంతం చేశాయి.

ఈమేరకు ఖమ్మం జిల్లాకు సోమవారం 150 ఆయిల్ ట్యాంకర్ల ఇంధనం లోడ్లు సరఫరా కాగా, మంగళవారం మరో 100 ట్యాంకర్ల ఇంధనం సరఫరా కానుంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి జిల్లాలోని అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంది. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేయవద్దని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ సందర్భంగా కోరారు.

ఎంపీ రవిచంద్రకు పెట్రోలియం డీలర్ల కృతజ్ఞతలు:
పెట్రోల్, డీజిల్ కొరతపై చొరవ చూపాలని తాము కోరిన వెంటనే ఆయా కంపెనీల ఉన్నతాధికారులతో మాట్లాడి కేవలం 24 గంటల్లోనే సమస్యను పరిష్కరింపజేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు ఖమ్మం జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరప్రగడ రంగనాథ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి మంజుల కృతజ్ఞతలు తెలిపారు. డీలర్ల సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా మెరుగుపడినందున అన్ని బంకులు ఎప్పటిలాగానే యధావిధిగా వినియోగదారులకు తమ సేవలందిస్తాయని పేర్కొన్నారు.

Popular Articles