Top 5 This Week

Related Posts

మావోయిస్ట్ పార్టీ ‘మ్యాజిక్ వెపన్’ క్లోజ్: 42 మంది లొంగుబాటు

హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి అనుబంధమైన పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ సహా 42 మంది నక్సల్స్ తెలంగాణా డీజీపీ బి. శివధర్ రెడ్డి ముందు శుక్రవారం లొంగిపోయారు. మొత్తం 36 తుపాకులను, 800 గ్రా. బంగారాన్ని కూడా లొంగిపోయిన నక్సల్స్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి అప్పగించారు.

జనజీవన స్రవంతిలో కలిసిన 42 మంది నక్సల్స్ లో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సోడి మల్ల అలియాస్ కేశాల్, స్టేట్ కమిటీ మెంబర్ చాప నారాయణ అలియాస్ గజేందర్, భద్రాద్రి-అల్లూరి జిల్లాల డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అప్పగించిన ఆయుధాల్లో ఐదు ఏకే-47, నాలుగు ఎస్ఎల్ఆర్, మూడు ఇన్సాస్, ఆరు .303 తుపాకులు, ఒక 9ఎంఎం స్టెన్ గన్, రెండు 8ఎంఎం రైఫిళ్లు, పది సింగిల్ షాట్ గన్స్, ఒక 9ఎంఎం పిస్టల్, రెండు రివాల్వర్లు, ఒక బీజీఎల్ గన్, మరో ఎయిర్ గన్ వంటి ఆయుధాలు ఉన్నాయి. లొంగిపోయిన నక్సల్స్ లో ఏరియా కమిటీ మెంబర్ కుంజం ఇడ్మాల్ అలియాస్ మహేందర్ మినహా మిగతా 41 మంది ఛత్తీస్ గఢ్ కు చెందినవారే కావడం గమనార్హం.

నక్సల్స్ అప్పగించిన తుపాకులను పరిశీలిస్తున్న డీజీపీ శివధర్ రెడ్డి, పక్కన ఎస్ఐబీ చీఫ్ బి. సుమతి

కాగా ఈ తాజా లొంగుబాటు పర్వంతో పీఎల్ఝీఏ పూర్తిగా కనుమరుగైందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీకి చెందిన మూడు ‘మ్యాజిక్ వెపన్స్’లో అత్యంత కీలకమైన పీఎల్జీఏ ఇక లేనట్లేనని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణా రాష్ట్ర కమిటీలోని నాయకులు లొంగిపోయిన తర్వాత, మిగిలిన రాష్ట్ర కమిటీ కేడర్ అందరూ ఈరోజు జనజీవన స్రవంతిలో కలిశారని, తద్వారా తెలంగాణా రాష్ట్ర కమిటీ ఉనికి పూర్తిగా లేకుండాపోయిందని డీజీపీ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు సాయుధ దళాల నుంచి పూర్తిగా విముక్తి చెందినట్లు చెప్పారు.

లొంగిపోయిన మావోయిస్టులు

లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాస చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ చెప్పారు. నక్సల్స్ లొంగుబాటు చర్యల్లో తెలంగాణా స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ పోలీసులను ఆయన ప్రశంసించారు. తెలంగాణాకు చెందిన వారు ఇక గణపతి సహా ఐదుగురు మాత్రమే అండర్ గ్రౌండ్ కేడర్ మిగిలి ఉన్నట్లు చెప్పారు. ఆ ఐదుగురు రాష్ట్రం వెలుపల ఛత్తీస్ గఢ్, ఇతర రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

Popular Articles