Top 5 This Week

Related Posts

జర్నలిజం చచ్చిపోయింది.. ఇదిగో సాక్ష్యం..!

(సమీక్ష ప్రత్యేక కథనం)
జర్నలిజం చనిపోవడమంటే ఏమిటి..? జర్నలిస్టులు లెగ్ వర్క్ చేయకపోవడం.. ఇన్వెస్టిగేషన్ కు ఉపక్రమించకపోవడం.. కేవలం వాట్సాప్ సమాచారంపై ఆధారపడడం.. ఇవేవీ కావు. జర్నలిజం చనిపోవడమే కాదు, జర్నలిస్టు ముసుగులో సంచరించేవాళ్ల బుర్ర మొత్తంగానే పనిచేయడం లేదని అంగీకరించక తప్పని ఘటన ఇది.

చాలా రోజుల తర్వాత అలా ఫీల్డులోకి వెళ్లి చూద్దామని బయలుదేరాను. వెబ్ సైట్ నిర్వహణలో పెద్దగా లెగ్ వర్క్ చేయడం లేదని భావించి, ఓసారి అలా బయటకు వెళ్లడానికి సిద్ధమై తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనను అందుకు ఎంచుకున్నాను. ఖమ్మం నగరానికి దగ్గరగానే ఉందని ఆయన పాల్గొనే కార్యక్రమానికి వేదికైన బోనకల్ వెళ్లాను. అక్కడ 8 నుంచి 12 తరగతుల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది. వేదిక ముందు గల కుర్చీల్లో స్థానిక విలేకరులతోపాటు నేనూ కూర్చున్నాను.

సభా వేదికపై డిప్యూటీ సీఎం భట్టి రానే వచ్చారు. విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ ఆవశ్యకత గురించి ఆయ వివరించారు. ఇద్దరు ముగ్గురు స్నేహితులతో మాట్లాడి తమ కుటుంబానికి చెందిన అమ్మ ఫౌండేషన్ ద్వారా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని పాఠశాల విద్యార్థులకు, జూనియర్ కాలేజీ స్టూడెంట్లకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్య ద్వారా మాత్రమే సాధించే జీవిత లక్ష్యాల గురించి భట్టి విద్యార్థులకు ఉద్భోదించారు. ఆ తర్వాత సైకిళ్లను పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించి తదుపరి కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం ఎర్రుపాలెం వైపు బయలుదేరారు. ఇక్కడే సాక్షాత్కరించిన ఓ దృశ్యాన్ని చూసిన తర్వాత కొన్ని సెకన్ల పాటు నా బుర్ర కూడా పనిచేయలేదంటే ఆశ్చర్యం కాదు.

డిప్యూటీ సీఎం పర్యటనను అనుకరించడానికి బోనకల్ వచ్చిన ఆయన సీపీఆర్వో ఎం. మధుసూదన్ బయలుదేరుతున్న క్రమంలో ఓ ప్రముఖ పత్రిక స్థానిక విలేకరి అతని వద్దకు వచ్చి ఐటెమ్ గ్రూపులో పెడుతున్నారా? అని ప్రశ్నించాడు. ఓకే పంపిస్తాను అని మధుసూదన్ సమాధానమిచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. ఏదో కారణం చేత కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన జర్నలిస్టు సోదరుడెవరైనా కార్యక్రమానికి సంబంధించిన ఐటెమ్ పీఆర్వోను అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇక్కడ సీన్ అందుకు విరుద్ధం. భట్టి రాకకు ముందే కనీసం రెండు గంటల ముందు అక్కడికి చేరుకుని, కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం వచ్చిన ప్రభుత్వ అధికారులతో పిచ్చాపాటీగా ముచ్చటించి, భట్టి రాగానే ఆయనకో నమస్కారం సమర్పించి, తాను కూడా వచ్చానని డిప్యూటీ సీఎం వద్ద హాజరు వేయించుకున్న ఆ విలేకరి సీపీఆర్వోను కార్యక్రమపు ఐటెమ్ పంపాలని కోరడమే నాకు విచిత్రంగా తోచింది. ఎవరో చిన్నా, చితకా పత్రికా విలేకరి అడిగాడంటే, తెలుగులోనే ప్రసంగించిన భట్టి స్పీచ్ అతనికి అర్థం కాలేదు కావచ్చని భావించవచ్చు. రాయడం చేతగాక వార్తను అడుక్కున్నాడని అవతగతం చేసుకోవచ్చు.

కానీ తెలుగు మీడియాలోని ప్రముఖ దినపత్రికల జాబితాలో గల ఆ ప్రతిష్టాత్మక పత్రిక స్థానిక విలేకరి రెడీమేడ్ వార్త కావాలని డిప్యూటీ సీఎం సీపీఆర్వోను కోరిన ఘటనతో జర్నలిజం చచ్చిపోయిందనే అభిప్రాయానికి వచ్చాను. ఇన్నాళ్లపాటు ఈ ప్రచారాన్ని నేను పెద్దగా నమ్మలేదు. కానీ ఇప్పుడు విశ్వసించాను.. ఎందుకంటే..?

మంత్రుల పీఆర్వోలు పంపే వార్త ఎలా ఉంటుందో అసలు సిసలు జర్నలిస్టులకు తెలియని విషయమేమీ కాదు. ఎటువంటి ప్రతికూల అంశాలుగానీ, వ్యాఖ్యలుగాని పీఆర్వోలు పంపే వార్తలో ఉండవు. తమ నాయకునికి అనుకూల పదాలను మాత్రమే పీఆర్వోలు రాస్తుంటారు. ఇది వాళ్ల విధి.. తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు.

కానీ కార్యక్రమానికి హాజరైన తర్వాత లీడ్ నుంచి చివరి వరకు మన శైలిలో రాసుకునే వార్త ఎలా ఉంటుందో ‘జర్నలిస్టు’లకు తెలిసిందే. ఇదే సందర్భంలో అక్కడే గల ఓ ప్రభుత్వ నిఘా విభాగపు అధికారి సదరు స్థానిక విలేకరి గురించి చేసిన వ్యాఖ్యలేమిటో తెలుసా? ‘ఏమనుకుంటున్నావ్ అన్నా.. అతన్ని చూస్తే స్థానిక ప్రభుత్వ అధికారులు గజగజ వణికిపోతుంటారు. ఈ మండలంలో అతనో డాన్ తెలుసా? భూ సమస్యలను సృష్టించేదీ అతనే.. అధికారులను భయపెట్టి పరిష్కరించేది అతనే.. సెటిల్మెంట్లు చేసేదీ అతనే..’ అని ఆ నిఘా విభాగపు అధికారి చేసిన వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే జర్నలిజం చచ్చిపోయిందనే వాదనను ఈ ఘటన ద్వారా నేనూ విశ్వసిస్తున్నాను కాబట్టి.. అదీ సంగతి.

Popular Articles