సత్తుపల్లి: సైబర్ నేరాల కేసులో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు కల్లూరి ఏసీపీ వసుంధర యాదవ్ చెప్పారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన సైబర్ నేరాల కేసులో నిందితులైన ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ, CSB బ్యాంక్ చండ్రుగొండ మేనేజర్ అఖీల్ అబ్ధుల్ కు సహకరించినందుకు గాను ఈ ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు ఆమె చెప్పారు.
అరెస్టయిన వారిలో చండ్రుగొండ CSB బ్యాంక్ ఉద్యోగులైన బెండాలపాడుకు చెందిన కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ ఒర్సు కృప, పెనుబల్లి మండలం బయ్యన్నగూడేనికి చెందిన కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ మందా శ్రీహరిబాబు, చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ జుంజునూరి రాధాక్రిష్ణలు ఉన్నట్లు చెప్పారు.

ఈ ముగ్గురు నిందితులను సత్తుపల్లి సీఐ టి. శ్రీహరి అరెస్ట్ చేశారని, ఇదే కేసులో పరారీలో గల మరికొందరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ వసుంధర యాదవ్ వివరించారు.

