ఇరాన్ పై యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఎదురయ్యే ‘పరిస్థితి’ని ఓ విశ్లేషకుడు గత నెల 28వ తేదీనే చెప్పారంటే ఆశ్చర్యం కాదు. ట్రంప్ తన టెంపరితనం చూపడానికి అది వెనెజువెలా కాదని, ఇరాన్ అని ఇఫ్టూ ప్రసాద్ గా ప్రాచుర్యం పొందిన పి. ప్రసాద్ అనే విశ్లేషకుడు గత నెల 28వ తేదీనే తన ఫేస్ బుక్ వాల్ పై ఓ ఆసక్తికర వ్యాసం రాశారు. అయితే ఆయన ఈ వ్యాసం రాసిన రోజునే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. దీంతో నెటిజన్లు కొందరు అతని విశ్లేషణపై తమదైన రీతిలో కామెంట్లు పెట్టారు. కానీ ప్రసాద్ విశ్లేషణకు సరిపోయేవిధంగా నేడు ట్రంప్ పరిస్థితి కనిపిస్తుండడమే అసలు విశేషం. హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని, లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని అల్టిమేటమ్ జారీ చేసిన ట్రంప్ తాను విధించిన గడువు ముగియకముందే యుద్దాన్ని, ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. మరోవైపు ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ వ్యాఖ్యానించింది. కాగా ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైందని అమెరికా మాజీ రక్షణ మంత్రి, సీఐఏ మాజీ చీఫ్ లియోస్ పనెట్టా తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇంతకీ ఇరాన్ పై యుద్దం ప్రారంభించిన ‘ట్రంపరితనం’ ఓటమిపాలు కాక తప్పదని ఇఫ్టూ ప్రసాద్ యుద్ధం ప్రారంభంలోనే ఎలా చెప్పగలిగారు? ఆయనేమీ జ్యోతిష్యుడు కాదు.. ఓ విశ్లేషకుడు మాత్రమే. ఫిబ్రవరి 28వ తేదీన తన ఫేస్ బుక్ వాల్ పై ప్రసాద్ రాసిన ఆసక్తికర వ్యాసం ‘సమీక్ష’ పాఠకుల కోసం.. ఇక చదవండి..

ఇది వెనెజువెలా కాదు సుమా, ఇది ఇరాన్
ఇరాన్ మీద యుద్ధం మొదలైందని ట్రంప్ ప్రకటించాడు. ఔను ఇది యుద్ధమే. కానీ అమెరికా అంతిమంగా ఘోరంగా ఓటమి పాలు కానుంది. ఎందుకంటే…?
సీనియర్ జార్జి బుష్ ఇంతకంటే పది రెట్ల దూకుడుతనంతో 2001లో ఆఫ్గాన్ పై , 2003 లో ఇరాక్ పై దురాక్రమణ యుద్దాలను మొదలుపెట్టాడు. అవి కేవలం గగనతల యుద్దాలకు పరిమితం కాలేదు. అవి భూతల యుద్దాలుగా సాగాయి. ఆ యుద్దాల్లో వేల మంది అమెరికా సైనికులు మరణించారు. పదుల వేల మంది వికలాంగులు అయ్యారు. అందులో అత్యధిక శాతం మంది శాశ్వత వికలాంగులు కూడా అయ్యారు. చివరికి ఏమైంది? ఇరాక్ లో ఓడి పోయింది. ఆఫ్గనిస్తాన్ నుండి పారిపోయింది.
జార్జి బుష్ కాలం నాటి ప్రపంచం ఏకధ్రువ స్వభావం గలది. నేటి ట్రంప్ కాలంలో ప్రపంచం బహుళ ధ్రువ స్వభావం గలది. ఈ రెండు రకాల ప్రపంచాల మధ్య గుణాత్మక తేడా వుంది. బుష్ కాలం నాటి అమెరికా చేసిన అప్పు మేనేజబుల్ స్థాయిలో వుంది. నేటి అమెరికా అప్పు అదుపు తప్పింది.
ఆయా రెండు గుణాత్మక తేడాల్లో ఒకటి అమెరికా బాహ్య కారణంగా పని చేస్తే, రెండవది అంతర్గత ఆర్ధిక వ్యవస్థపరమైన కారణంగా పని చేస్తుంది. ఇవే కాకుండా మరెన్నో తేడాలు నాటికీ నేటికీ మధ్య వున్నాయి. ఆ లెక్కన బుష్ కాలం అమెరికా కంటే నేటి ట్రంప్ కాలపు అమెరికా సాపేక్షికంగా అత్యంత బలహీనమైనది. నాటి బుష్ రంకెలకూ, నేటి ట్రంప్ రంకెలకూ మధ్య శబ్ద తీవ్రతను బట్టి సాధించే ఫలితాలు వుండవు. వారి స్థల, కాలాల స్థితిగతుల మీద ఆధారపడి విజయాలు, ఓటములు వుంటాయి. నేటి కంటే బుష్ కాలంలో అనేక రెట్లు అనుకూల స్థితిలో వున్నప్పుటికీ నాటి అమెరికా ఓటమి చెందింది. దాదాపు 38 ట్రిలియన్ డాలర్ల అప్పుతో వడ్డీలు చెల్లించలేని రుణగ్రస్త దేశంగా మారిన నేటి అమెరికా గెలుపు ఎలా సాధిస్తుంది?
బుష్ కాలంలో ఇరాక్, ఆఫ్గాన్ వంటి దేశాల ప్రజలు చేపట్టే సాయుధ ప్రతిఘటనల నుండి తప్ప ప్రపంచంలో తన ప్రత్యర్థి సామ్రాజ్యవాద దేశాల నుండి ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి అమెరికాకు లేదు. నేడు ప్రపంచంలో ప్రత్యర్థి యుద్ధ కూటాలు ఏర్పడే స్థితి వుంది. మరి ఇరాన్ పై యుద్ధంలో అమెరికా ఎలా గెలుస్తుంది?

వెనెజువెలా దేశ అధ్యక్షుడు మధురోని సునాయాసంగా ట్రంప్ సర్కార్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత అమెరికా దుస్సాహాసికతకు ప్రాచుర్యం చేకూరింది. ప్రపంచంలో అమెరికా ఏ దేశంలోనైనా దాడి చేసి ఏ అధినేతనైనా హత్య లేదా కిడ్నాప్ చేస్తుందనే భావన వ్యాపించింది. అయితే అదో భ్రమ తప్ప నిజం కాదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, వెనెజువెలా సైన్యం, ఇంటిలిజెన్స్ వంటి రాజ్య వ్యవస్థల ప్రచ్చన్న అండదండలు లేకుండా మధురోను కిడ్నాప్ చేయడం సాధ్యం కాదు. నిజాన్ని నిజంగా చెప్పాలంటే తమ దేశ అధ్యక్షుణ్ణి అంతటి ఘోర పద్దతిలో కిడ్నాప్ చేస్తే ఆ దేశ ప్రజలు నిరసనగా రోడ్డెక్కలేదు. కనీసం ఒక్క రోజు సార్వత్రిక సమ్మె చేయలేదు. కారణాలు ఏమైనా అదో చేదు నిజం. ఇరాన్ లో అలా సాధ్యం కాదు. అదే తరహ దాడికి ఒకవేళ అమెరికా దిగితే ఇరాన్ ఒక అగ్ని పర్వతంగా మండుతుంది. పైగా మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఆధ్వర్యంలో బలమైన ప్రతిఘటనా కూటమి వుంది. ఎర్రసముద్రం తీరం నుండి మధ్యధరా సముద్ర తీరం వరకూ అది బలంగా విస్తరించిన సంఘటన కావడం గమనార్హం!
ఈ యుద్ధ గమనంలో మొదట్లో ఇరాన్ తీవ్ర నష్టం పొందవచ్చు. ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చు. అయినా అవి యుద్ధ గమనాన్ని మార్చలేవు. పైగా తక్షణ ఫలితాల్ని బట్టి అంతిమ యుద్ధ ఫలితాలు వుండవు. అంతిమంగా గగనతల యుద్దాన్ని నిలిపివేసి భూతల యుద్ధంగా మార్చకుండా అమెరికా చమురు కంపెనీలు కోరే ఇరాన్ చమురు మాత్రం దొరకదు. మున్ముందు ఇరాన్ నేలపైకి అమెరికా సైనికులు కాలు పెట్టిన రోజు అమెరికాకి ఇరాన్ సమాధి స్థలంగా మారక తప్పదు.
నేడు ఇరాన్ పై అమెరికా ప్రకటించిన యుద్ధం వెనెజువెలా పై కిడ్నాప్ చర్య వంటిది కాదు. ఇది ఊహజనిత జోస్యం కాదు. చారిత్రిక గమన సూత్రాల ప్రకారం రేపు జరగబోయే చేదు నిజం. జంతు పరిణామ క్రమంలో డ్రైనో సారస్ ఏ విధంగా అంతరించిందో యుద్దాల సామ్రాజ్యవాద యుగంలో అగ్రరాజ్య స్థానాలను వంతులవారీగా కోల్పోయే స్థితి వస్తుంది. అట్టి అగ్రరాజ్యాల్లో నేడు అమెరికా వంతు కూడా వచ్చిందేమో! వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లు ట్రంప్ పగ్గాలు ధరించిన కాలంలో ఆ పరిణామం జరుగుతుందేమో! ఆ వినాశకర విధానానికి అంతం పలికే చారిత్రిక బాధ్యత కేవలం ఇరాన్ ప్రజలకే వదలకుండా ప్రపంచ ప్రజలు కూడా చేయి కలపాల్సి వుంది. మనం కూడా మన వంతు పాత్ర పోషిద్దాం.
✍️ పి. ప్రసాద్ (పిపి) 28-2-2026

