కొణిజర్ల: ఏప్రిల్ నెలాఖరు నాటికి గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్న గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనుల పురోగతిని, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ పామ్ మొక్కలు తీసుకొచ్చి మొదటిసారిగా నాటినట్లు చెప్పారు. అప్పటివరకు మనకు ఈ పంట లేదని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా ఆయిల్ పామ్ పంట విస్తరణ కోసం అనుమతులు తాను సాధించినట్లు చెప్పారు.
ప్రతి ఎకరానికి 51 వేల రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం రైతులకు అందిస్తుందన్నారు. పంట మార్పిడి చేసుకోలేకపోతే రైతులు ఇబ్బందులు పడతారని, ధాన్యం కొనుగోలును కేంద్ర ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తున్నదని తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో వరి పంట వేయకపోతే డబ్బులు ఇస్తున్నారని అన్నారు. యూరియా అధిక వాడకం వల్ల పంజాబ్ లో క్యాన్సర్ ఎక్కువ అయిందని, ప్రస్తుతం మన దగ్గర కూడా యూరియా ఎక్కువగా వాడుతున్నామని దీనివల్ల నష్టాలు వస్తాయన్నారు. పంటల మార్పిడి విధానం రైతులు తప్పని సరిగా అనుసరించాలని లేని పక్షంలో చాలా నష్టాలు వస్తాయని మంత్రి చెప్పారు.

మల్టీ నేషనల్ కంపెనీ గోద్రెజ్ వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి సారించిందన్నారు. ఏపీలో గతంలోనే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారని ప్రస్తుతం ఖమ్మంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో పాటు ఇక్కడ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు ఎటువంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఈ నెల 22న సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా జరిగే నూతనంగా నిర్మించిన నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రైతులందరూ వెళ్లాలని, అక్కడ మూడు రోజుల పాటు వ్యవసాయ ప్రదర్శన ఉంటుందన్నారు. సీడ్ గార్డెనింగ్ ఏర్పాటుకు కంపెనీలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా సహకారం అందిస్తామన్నారు. సీడ్ గార్డెనింగ్ కోసం రైతుల దగ్గర్నుంచి భూమి తీసుకునే సమయంలో వారు సంతోషంగా ఉండేలా పరిహారం అందించాలని మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, ప్రాజెక్ట్ డీజీఎం., సర్పంచ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
