హైదరాబాద్: తెలంగాణా విద్యుత్ సంస్థలు రికార్డు సృష్టించాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థల చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రికార్డును నిక్షిప్తం చేసింది. శనివారం ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో శనివారం విద్యుత్ వినియోగం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం గమనార్హం.
నిరుడు మార్చి 18వ తేదీన నమోదైన 335.19 మిలియన్ యూనిట్ల సరఫరాను అధిగమిస్తూ శనివారం 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయడం విశేషం. అదే విధంగా, 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను కూడా విజయవంతంగా తీర్చింది. ఇది గతంలో నమోదైన 17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ (20.03.2025) కంటే ఎక్కువ. ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలు అధికమవడంతో విద్యుత్ అవసరం, గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి.
రాబోయే రోజుల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూ కొనసాగుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరంతోపాటు సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్ ను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. బలమైన విద్యుత్ గ్రిడ్, సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఈ అవసరాలను ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్రానికి ఉందన్నానరు. ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు.

భట్టి విక్రమార్క కుమారున్ని, కోడలిని ఆశీర్వదించిన ఏపీ సీఎం చంద్రబాబు:
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు. ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు భట్టి విక్రమార్క – నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు.
గత మార్చి 5వ తేదీన సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే అప్పట్లో ఉన్న అత్యవసర కార్యకలాపాలు, బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు వివాహానికి హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరిలు కూడా పాల్గొన్నారు.

