హైదరాబాద్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్.పి.జి. గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి. లు, పోలీస్ కమిషనర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎల్.పి.జి. గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని, గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోటే కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు.

ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రోజువారీగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని చెప్పారు. అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, వృద్దాశ్రమలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 810 ఎల్.పి.జి. డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్.పి.జి కనెక్షన్లు ఉండగా, దినసరి 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోందని మంత్రి వివరించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదన్నారు. అపోహలను అడ్డుపెట్టుకుని సిలిండర్లను బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఉత్తమ్ హెచ్చరించారు. తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు గాను ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్.పి.జి. డిస్ట్రిబ్యూటర్లు ఇదే విధంగా ప్రవర్తిస్తే మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను, ఎస్.పి. లను, పోలీస్ కమిషనర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి , గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దన్నారు. గృహా వినియోగదారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామని, ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
