Top 5 This Week

Related Posts

ఇంతకీ వెలుగుమట్లలో రేవంత్ సర్కార్ బావుకున్నదేమిటి!?

(సమీక్ష ప్రత్యేక కథనం)
నిష్టూరమైనా సరే.. నిజం ఇదే. బహుళ ప్రాచుర్యంలో గల ‘పిర్ర గిల్లి జోలపాట’ పాడిన చందపు సామెతను గుర్తుకు తెచ్చే విధంగా ‘వెలుగుమట్ల’ కూల్చివేతల వివాదంలో ఎట్టకేలకు రేవంత్ సర్కారు దిగొచ్చిందనే చెప్పాలి. ఇందులో భాగంగానే వెలుగుమట్ల కూల్చివేతల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పేదలకు నివాస స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత నెల 24వ తేదీన వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కూల్చిన 700 పైచిలుకు ఇండ్లలో గలవారి ఆర్థిక, సామాజిక సర్వే ద్వారా అసలైన పేదలెవరనే విషయాన్ని తేల్చింది. ఇందులో 311 మందికి అసలు నివాస స్థలమే లేదని, 101 మందికి మాత్రం ఇంటి స్థలం ఉన్నప్పటికీ, ఇల్లు లేదనే విషయాన్ని సర్వేలో తేల్చారు.

మొత్తంగా నిలువ నీడలేని పేదలకు ఇంటి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద గూడు నిర్మించుకునేందుకు అవసరమైన మంజూరీలు ఇచ్చేందుకు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో బాధితులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. కూల్చినచోటే ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం మెట్టు దిగక తప్పలేదు. ఇంతకీ వెలుగుమట్ల కూల్చివేతల ద్వారా ప్రభుత్వం బావుకున్నదేమిటి? ఇదీ అసలు చర్చ.

గత నెల 24న వెలుగుమట్ల భూముల్లో కూల్చివేతల దృశ్యం (ఫైల్)

రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైన వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేతల అంశంలో తెలంగాణా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ‘బద్నాం’ అయిందనే చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడానికి ఎక్కడైతే బీజం పడిందో.., అధికారానికి చేరువయ్యేందుకు ప్రభావితమయ్యే రాజకీయ పరిణామాలు ఎక్కడైతే ఏర్పడ్డాయో.., ప్రభుత్వంలోని కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న నాయకులు ఎక్కడైతే ఉన్నారో.,. అక్కడే ఓ అనాలోచిత, దుందుడుకు చర్యకు దిగిన ఫలితం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేసిందనేది కాదనలేని వాస్తవం.

ఈ విధ్వంసపు చర్య రేవంత్ సర్కారుకు తీరని నష్టాన్ని కలిగించడమేకాదు, గులాబీ పార్టీకి సింగిల్ సీటుకు మించి దక్కకుండా, గడచిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించి అక్కున చేర్చుకున్న ఖమ్మం జిల్లా ప్రజల్లో తీవ్ర ఆలోచనకు తావు కల్పించిందనే చెప్పాలి. అలాగని బీఆర్ఎస్ పార్టీవైపు జనం చూపు మళ్లుతోందని చెప్పే పరిస్థితీ కాదు. కానీ ఈ కూల్చివేత చర్య సామాన్య జనాన్ని ఆలోచనవైపు తిప్పిందనేది అంగీకరించక తప్పని అంశం. ఇక కూల్చివేతల విధ్వంసం ద్వారా సర్కారు బావుకున్నదేమిటనే ప్రశ్నకు వస్తే.. అధికారిక లెక్కల ప్రకారమే మొత్తం 31.07 ఎకరాల భూదాన్ భూముల్లో 10.00 ఎకరాలు ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రజోపయోగ సంస్థల నిర్మాణాలకు కేటాయించారు. ఇక మిగిలిన 21.07 ఎకరాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. గతనెల 24వ తేదీన 700పైచిలుకు ఇండ్లను కూల్చివేశాక ఇప్పుడు 311 మందికి అక్కడే ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు.

కూల్చివేతల తర్వాత వెలుగుమట్ల భూముల దృశ్యం

దాదాపు 9.00 ఎకరాల్లో బాధితులకు 75 చదరపు గజాల చొప్పున స్థలం పట్టాలు ప్రదానం చేయనున్నారు. దీన్ని మినహాయిస్తే కూల్చివేతలు, ఆందోళనలు, ఉద్యమాల ఫలితం అనంతరం ప్రభుత్వం చేతిలో ఇప్పుడు మిగిలింది ఇక 12 ఎకరాలు మాత్రమే. జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించిన ప్రకారం పేదల ఇండ్లను కూల్చి స్వాధీనం చేసుున్న మొత్తం 21.07 ఎకరాల విలువ రూ. 250 కోట్లు. ఈ ప్రాతిపదికన ప్రస్తుతం పేదలకు పట్టాలు ఇస్తున్న 9.00 ఎకరాల విలువను మినహాయిస్తే, మిగతా 12 ఎకరాల స్థలం విలువ సుమారు రూ. 146.00 కోట్లు.

వెలుగుమట్ల భూముల్లో పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చే విషయంలో చేపట్టిన దుందుడుకు చర్య రేవంత్ ప్రభుత్వానికి తీరని అప్రతిష్టను కలిగించిందని మళ్లీ మళ్లీ చెప్పక తప్పదు. భూదాన్ భూములను కాపాడేందుకు, అక్రమణలను తొలగించేందుకు ముందుగా అఖలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికార పక్షం చర్చించాల్సి ఉండేది. ఈ భూముల్లో చోటు చేసుకున్న ఆక్రమణలు, అందుకు పురిగొల్పిన నక్సల్ పార్టీ గురించి, నమెదైన పోలీసు కేసుల ప్రకారం జరిగిన అక్రమ వసూళ్ల గురించి అఖిలపక్షానికి కూలంకషంగా వివరించి చర్య తీసుకుని ఉంటే పరిస్థితి ఇంకోరకంగా ఉండేదేమో! ఇటువంటి యోచనేదీ చేయకుండా వేలాది మంది పోలీసులను మోహరింపజేసి, ఎనిమిదేళ్లుగా నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్న పేదల గూడును విధ్వంసం చేయడమే ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిల్చింది.

‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా జరగాల్సిన నష్టం జరిగాక, విషయాన్ని ఆలస్యంగా గ్రహించాక ప్రభుత్వం దిగిరాకతప్పలేదు. కూల్చివేతలకు ముందు, ఆ తర్వాత అంతర్గతంగా ప్రభుత్వంలో జరిగిన చర్చ ఏమిటనేది బహిర్గతం కాకపోయినప్పటికీ, అసలు ఈ కూల్చివేతలకు ఆదేశం ఇచ్చిందెవరనేది మాత్రం నిగూఢ రహస్యంగానే మిగిలింది. ప్రభుత్వంలోని ఎవరేని పెద్దల ఆదేశంతో అధికార యంత్రాంగం ఇందుకు ఉపక్రమించిందా? లేక రెవెన్యూ అధికారులే స్వంత నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అధికారులే స్వయంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ప్రభుత్వం ఈపాటికి వారిపై తీవ్ర చర్యలు తీసుకునేదనే వాదనా ఈ సందర్భంగా ఉంది.

ఇటీవల ఖమ్మం కలెక్టరేట్ లో వెలుగుమట్ల బాధితులు కొందరు (ఫైల్ ఫొటో)

మొత్తంగా వెలుగుమట్ల కూల్చివేతల ఘటన రేవంత్ సర్కారుకు రాజకీయంగా భారీ నష్టాన్ని కలిగించిందనేది నిర్వివాదాంశం. కాంగ్రెస్ కంచుకోటగా ప్రాచుర్యం పొందిన ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి ఇది ఎప్పటికీ మాయని మచ్చ. ముదిగొండ కాల్పుల ఘటనలాగే వెలుగుమట్ల కూల్చివేతల చర్య కూడా చరిత్రలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది. సామాజిక, ఆర్థిక సర్వే ద్వారా పేదలను గుర్తించి కూల్చివేసిన చోటే ఇంటి స్థలాలు ఇవ్వడం ఒకింత నష్టనివారణ చర్య మాత్రమే. కానీ పేదల గూడు గుండెల్లో గుచ్చుకున్న విధ్వంసపు బుల్డోజర్ కలిగించిన నెప్పి ఎప్పటికీ మాయని గాయంగానే మిగులుతుంది. దాని ఫలితమేమిటనేది భవిష్యత్ మాత్రమే తేలుస్తుంది.

Popular Articles