Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

రాజకీయాలకు జీవన్ రెడ్డి స్వస్తి!?

జగిత్యాల: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయాలకు స్వస్తి చెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జగిత్యాలలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్న పరిస్థితులు జీవన్ రెడ్డిని రాజకీయంగా తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి తాజాగా నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై తాను ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, భవిష్యత్తు గోచరించడం లేదని, ఈ అవమానాలు ఇంకా ఎంత కాలం భరించాలని ఆయన ప్రశ్నించారు. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపైనా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతకాలం తనకు వేధింపులు తప్పవని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారలేదని స్పీకర్ చెబుతున్నారని, కానీ సంజయ్ కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నారని, జగిత్యాలలోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో తొమ్మిది నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందోనని జీవన్ రెడ్డి అన్నారు.

జీవన్ రెడ్డి చేసిన ఆయా వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయంగా ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డెబ్బయి అయిదేళ్ల వయస్సులోకి అడుగిడిన జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. జగిత్యాల నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు దఫాలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో 1983లో చేరిన జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానూ పనిచేశారు.

సీఎం రేవంత్ రెడ్డితో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (ఫైల్ ఫొటో)

అప్పటి రాజకీయ పరిణామాల్లో 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేశారు.అనంతరం 1989, 1999, 2004 ఎన్నికల్లో, 1996 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఆర్ అండ్ బీ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2006, 2009లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. జగిత్యాల నుంచే 2014లో మళ్లీ గెలిచారు. ఆ తర్వాత 2019లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఇలా పలు ఎన్నికల్లో గెలుస్తూ, ఓడుతూ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం గల జీవన్ రెడ్డి గత కొంతకాలంగా జగిత్యాల రాజకీయాల్లో తీవ్ర అసహన పరిస్థితులను చవి చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన మనస్తత్వం ప్రకారం జీనన్ రెడ్డి ప్రస్తుతం మరే ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేవని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న జీవన్ రెడ్డి అటు బీజేపీలోకిగాని, ఇటు బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఏమాత్రం లేవంటున్నారు. దీంతో ఆయన ఏదేని కీలక నిర్ణయమంటూ తీసుకోవడం జరిగితే అది రాజకీయాలకు గుడ్ బై చెప్పడమేనని జీవన్ రెడ్డి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Popular Articles