(సమీక్ష ప్రత్యేకం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ ఛైర్మెన్ పదవిని అధిష్టించేది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ఆ జిల్లా కాంగ్రెస్ వర్గీయుల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఓరకంగా చెప్పాలంటే ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ పీఠంపై అధిష్టించడానికి ఎన్నిక కావలసిన కౌన్సిలర్ ను ఎంపిక చేయడమనేది రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టకు పెద్ద పరీక్షగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మెన్ ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ అభ్యర్థి ఎంపిక మంత్రి పొంగులేటికి అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పక తప్పదు. ఇందుకు గల కారణాల పూర్వాపరాల్లోకి వెడితే..
వాస్తవానికి ఇల్లెందు మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్నే సాధించింది. ఇక్కడ మొత్తం 24 వార్డులు ఉండగా, అందులో 19 వార్డులను కాంగ్రెస్ గెల్చుకుంది. మూడింట బీఆర్ఎస్, రెండు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. పాలకవర్గం పదవులను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ ఇక్కడ లేదు. కాకపోతే అసలు ట్విస్టు ఇక్కడే ఉంది.

ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంత్రి పొంగులేటి శిబిరంలోని ముఖ్య నాయకుడనేది బహిరంగమే. కోరం కనకయ్యకు అత్యంత సన్నిహితుడైన మడుగు సాంబమూర్తి అనే వ్యక్తి స్థానిక కాంగ్రెస్ నాయకుడు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే సాంబమూర్తికే ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ పదవిలో కూర్చోబెట్టాలనేది ఎమ్మెల్యే కోరం కనకయ్య లక్ష్యంగా పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అయితే చైర్మెన్ పదవికి రిజర్వేషన్ కారణంగా సాంబమూర్తి కూతురుకు టికెట్ ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆమె ఓటమి పాలయ్యారు.
దీంతో ఇప్పుడు ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ ఎవరనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ పదవికోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతుండగా, అందులో ఓ కౌన్సిలర్ కుటుంబ యజమాని అటవీ భూముల అక్రమణదారుగా వార్తల్లోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం. మొన్నటి మున్సిపల్ ఎన్నికల నామినేసన్ల దాఖలుకు ఒకటి, రెండు రోజుల ముందు వరకు కూడా బీఆర్ఎస్ లో గల ఆ వ్యక్తి లిక్కర్, రియల్ ఎస్టేట్, ఇసుక దందాల్లో బహుళ ప్రాచుర్యంలో పొందాడు. ఇతని వ్యవహార శైలిపై మంత్రి పొంగులేటి గతంలోనే కన్నెర్రజేసినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా గత పాలకవర్గంలో జరిగిన ‘అవిశ్వాస’ తీర్మానం ప్రయత్నంలో పొంగులేటి మాటను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇతను వ్యవహరించాడని పార్టీ వర్గాలు చెప్పుకుంటుంటాయి.

ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇతని అక్రమ దందాలపై మంత్రి పొంగులేటి ఆగ్రహించారనే ప్రచారం జరిగింది. ఈ పరిణామాల్లోనే ఇల్లెందును ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయల విలువైన అటవీ భూములను ఆ వ్యక్తి ఆక్రమించినట్లు వార్తలు వచ్చాయి. ఇతని ‘కబ్జా’లపై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమై ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు. ఆయా భూముల్లో కోళ్ల పారాలను, ఇంటిని నిర్మించినట్లు గుర్తించిన అటవీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అటవీ భూముల్లో నిర్మించిన కోళ్ల ఫారాల షెడ్లను ధ్వంసం కూడా చేసి ఫెన్సింగ్ నిర్మించారు. ప్రస్తుతం ఈ భూఆక్రమణకు సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నట్లు తెలిసింది. ఇదే దశలో ఈ వ్యక్తి నిర్వహించే లిక్కర్ షాప్ పైనా అప్పట్లో ఓ కేసు నమోదైనట్లు వార్తలు వచ్చాయి.
అయితే దాదాపు రెండేళ్ల కాలం గడచాక అటవీ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తి అకస్మాత్తుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కూడా ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆ వ్యక్తి భార్య కూడా ప్రస్తుతం ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ బరిలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే జరిగితే ఇల్లెందు మున్సిపాలిటీలో అటవీ భూముల అక్రమణ ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తినే పరోక్షంగా అందలం ఎక్కించినట్లవుతుందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ అభ్యర్థి అంశంలో పొంగులేటి తీసుకునే నిర్ణయమే ఫైనల్ గా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ భూముల కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తి కుటుంబానికే ఇల్లెందు మున్సిపల్ ఛైర్మెన్ ను అప్పగిస్తారా? అనే ప్రశ్న కాంగ్రెస్ కేడర్ లో రేకెత్తుతోంది. ఇదే జరిగితే కబ్జాకు గురైన అటవీ భూముల పరిరక్షణకు గతంలో పొంగులేటి తీసుకున్న నిర్ణయం మాటేమిటనే అంశంపైనా ఇల్లెందులో తీవ్ర చర్చ జరుగుతోంది. తన శాఖలోని అధికారుల అవినీతి, అక్రమాల వ్యవహారంపై మంత్రి పొంగులేటి కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి కుటుంబాన్ని పదవీ అందలం ఎక్కిస్తారా? అనే ప్రశ్న ప్రామాణికంగా ఇల్లెందు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

