(సమీక్ష ప్రత్యేక కథనం)
మేయర్ పీఠం లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో రాజకీయ పావులు కదుపుతోందా? అనే ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలు ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయనే చెప్పాలి. కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన సీపీఐ పార్టీలు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడి ఓటర్లు ఆ రెండు పార్టీల్లో ఎవరికీ ఆధిక్యం ఇవ్వకుండా సంచలన తీర్పునిచ్చారు. దీంతో మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్, సీపీఐ సరి సంఖ్యలో 22 చొప్పున గెల్చుకున్నాయి. మరో 16 డివిజన్లను బీఆర్ఎస్, స్వతంత్రులు, సీపీఎం, బీజేపీ పార్టీలు గెల్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల యుద్ధంలో ఢీ అంటే ఢీ అనే తరహాలో పోరాడిన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ఫలితాల వెల్లడి తర్వాత ‘స్వరం’ మార్చాయి. కొత్తగూడెం ఫలితాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఐకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తాము సీపీఐకి మద్ధతునిస్తామని బహిరంగంగానే మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేగాక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఫోన్ కూడా చేసి బేషరతుగా మద్ధతునిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూనంనేని ప్రకటించారు.

ఆ తర్వాత కొత్తగూడెం అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య స్నేహపూర్వక పోటీ జరిగిందన్నారు. కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి అక్కడ 45 డివిజన్లలో విజయం సాధించాయని, సీపీఐ తమ మిత్ర పక్షమని పొంగులేటి వ్యాఖ్యానించారు. దీంతో ఇరుపార్టీలు కూడా ఓ అంగీకారం దిశగా పయనిస్తున్నాయనే సంకేతాలు వెలువడినట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు.

కానీ గత రాత్రి అనూహ్య పరిణామాలు తెరపైకి వచ్చాయి. కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెల్చిన 32వ డివిజన్ కార్పొరేటర్ గుగులోత్ రాంబాబును కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ చేసిందనే ప్రచారం తీవ్ర కలకలానికి దారి తీసింది. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ధర్నాకు దిగారు. కిడ్నాప్ చేసిన తమ పార్టీ కార్పొరేటర్ ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, సీపఐ పార్టీలు గెల్చిన తమ కార్పొరేటర్లను తీసుకుని రహస్య క్యాంపులకు తరలించడం గమనార్హం. దీంతో కొత్తగూడెం నగరపాలక సంస్థలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే గతరాత్రి నుంచి జరిగిన రాజకీయ పరిణామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల సంఖ్యాబలం ఇక్కడ 28కి పెరిగినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ తరపున గెల్చిన 22 మంది, ఇక్కడి ఎన్నికల్లో మిత్రపక్షమైన సీపీఎం తరపున గెల్చిన కార్పొరేటర్ సహా ఆ సంఖ్య 23కు చేరింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెల్చిన ఆరుగురు ఇండిపెండెంట్లలో ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వడానికి ఆ పార్టీ నాయకుల ‘ఫోల్డ్’లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ల బలం ప్రస్తుతం 28 మందికి చేరినట్లు తెలుస్తోంది.

అయితే మేయర్ పీఠాన్ని అధిష్టించడానికి మేజిక్ ఫిగర్ 31 కాగా, మరో ముగ్గురు కార్పొరేటర్ల బలం కాంగ్రెస్ కు అవసరం. ఖమ్మం ఎంపీ ద్వారా ఎక్స్ అఫీషియో ఓటుగా బలం పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు కూడా సీపీఐకి ఉండడంతో ఈ ఓటు బలాన్ని ‘బ్యాలెన్స్’గా భావించవచ్చు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కును కొత్తగూడెంలో వినియోగించుకునేందుకు సాంకేతికత అంశం అడ్డుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు కార్పొరేటర్ల బలం చేకూరితే తప్ప కాంగ్రెస్ ఎత్తుగడ ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే రాజకీయంగా మంత్రి ‘పొంగులేటి’ శక్తి, సామర్థ్యాలపై గట్టి నమ్మకం గల కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మేయర్ పీఠంపై బలమైన నమ్మకంతోనే ఉన్నాయి.
మొత్తంగా కొత్తగూడెం నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి అమలు చేయాల్సిన వ్యూహం అచరణ దిశగా కాంగ్రెస్ ముఖ్యులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే మేయర్ పీఠం, లేదంటే ‘స్నేహపూర్వక’ పోటీ, పరస్పర మద్ధతు అనే సూత్రం ఎలాగూ ఉంటుందనే కోణం నుంచి కాంగ్రెస్ తన ప్రయత్నాలను తెరవెనుక తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే మూడేళ్లపాటు అధికారంలో కొనసాగే తమతో ఏరకంగానూ సీపీఐ విడిపోదనే గట్టి నమ్మకంతో కాంగ్రెస్ తన ప్రయత్నాలు తాను ముమ్మరం చేస్తున్నట్లు పరిశీలకుల విశ్లేషణ. చూడాలి.. కొత్తగూడెం మేయర్ పీఠం లక్ష్యంగా కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో..!

