Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

భట్టి ‘కోట’లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు సూపర్ హిట్

(సమీక్ష ప్రత్యేకం)
తెలంగాణా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం అత్యంత ప్రత్యేకంగా నిలిచిందనే చెప్పాలి. ఈ మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 18 చోట్ల ఘన విజయం సాధించింది. కేవలం ఒకే ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అయితే మరో మూడు స్థానాల్లో మాత్రం ‘స్వతంత్ర’ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు విజయం సాధించడమే అసలు విశేషం.

వాస్తవానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ పార్టీలతో కలిసి ప్రయాణం చేసింది. అందులో భాగంగానే మధిరలో కాంగ్రెస్ తో, కొత్తగూడెంలో సీపీఐతో, అశ్వారావుపేటలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. అయితే తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ అధిష్టానం అధికారికంగా స్థానిక అభ్యర్థులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ స్థానిక నేతలకు పార్టీ తరపున ఎటువంటి బీ ఫారాలు లభించలేదు.

ఈ నేపథ్యంలో మధిరలో టీడీపీకి చెందిన ముగ్గురు కూడా కాంగ్రెస్ మద్ధతుతో స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగారు. దీంతో కాంగ్రెస్ తరపున 18 మంది, టీడీపీ నుంచి పోటీకి దిగిన ముగ్గురు కూడా తిరుగులేని విజయం సాధించడం గమనార్హం. ఎంతగా శ్రమించినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ ఒకే ఒక్క వార్డులో గెలుపొందింది.

ఇదీ చదవండి:

అదేవిధంగా కొత్తగూడెం నగరపాలక సంస్థలోనూ తెలుగుదేశం పార్టీ సీపీఐతో పొత్తు కుదుర్చుకుంది. టీడీపీకి చెందిన ఇద్దరికి సీపీఐ బీ ఫారాలు ఇచ్చి తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేయించింది. అయితే ఇక్కడా ఈ ఇద్దరు టీడీపీ అభ్యర్థులు ఓటమి చెందారు.

ఇటు మధిరలో కాంగ్రెస్ తో, అటు కొత్తగూడెంలో సీపీఐతో పొత్తు కుదుర్చుకున్న తెలుగుదేశం పార్టీ భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో గులాబీ పార్టీ ‘కారు’తో పయనించింది. అక్కడ ఓ వార్డులో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థికి బీఆర్ఎస్ తన బీ ఫారాన్ని కేటాయించి ‘కారు’ గుర్తుపై పోటీ చేయించింది. కానీ అతను కూడా పరాజయాన్నే చవి చూశారు.

మొత్తంగా మూడు చోట్ల వేర్వేరు పార్టీలతో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ మధిరలో మాత్రమే వందకు వంద శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు రాజకీయంగా సూపర్ హిట్ అయిందనేది సుస్పష్టం.

Popular Articles