Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

పొంగులేటి ‘గ్రూప్ కాల్’లో బీఆర్ఎస్ కోవర్టుల కలకలం

(సమీక్ష ప్రత్యేక కథనం)
కలకలం.. ఓ రకంగా సంచలనం కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో బీఆర్ఎస్ కోవర్టుల ‘కత’ ఇది. తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్న ఓ గ్రూప్ కాల్ సంభాషణను వాయిస్ రికార్డ్ చేసి విపక్ష బీఆర్ఎస్ పార్టీకి అస్త్రంగా అందించిన ప్రభుత్వం ఉద్యోగులెవరనే ప్రశ్న రేకెత్తుతోంది. మున్సిపల్ ఎన్నికలకు ముందురోజు వెలుగు చూసిన ఈ ఘటనలో మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు, విమర్శలు చేయగా, అసలు తన సంభాషణ గులాబీ పార్టీ నేతల చేతికి ఎలా చిక్కిందని కూడా మంత్రి పొంగులేటి ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతోందనే అనుమానాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అసలేం జరిగింది..? ఇదీ తాజా చర్చ.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణా ఎన్జీవోల కాలనీకి చెందిన ఉద్యోగులు అనేక మంది పాలేరు నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలో ఓటర్లుగా ఉన్నారు. సుమారు 8,000 మంది ఉద్యోగులు ఏదులాపురం మున్సిపల్ ఓటర్లుగా ఉన్నారు. ఇందులో దాదాపు 1,500 మంది ఉద్యోగులు ఆదివారం ఓ ‘గ్రూప్ కాల్’ నిర్వహించుకున్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టీచర్లు, అధికారుల స్థాయి నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల హోదా వరకు కూడా ఈ గ్రూప్ కాల్ లో పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి మంగళవారం మీడియాతో మాట్లాడినప్పటి చిత్రం

ఈ సందర్భంగా ఏయే వార్డులో ఎందరెందరు ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు? అనే అంశంపై ఒక్కొక్కరుగా మంత్రి పొంగులేటికి వివరిస్తున్నారు. ఇదే గ్రూపు కాల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగులతో మాట్లాడిన ‘వాయిస్’ కూడా ఉండడం బీఆర్ఎస్ నాయకులకు అస్త్రంగా లభించింది. అయితే ఈ ఘటనలో ఉద్యోగులు మంత్రితో, మంత్రి ఉద్యోగులతో మాట్లాడిన మాటలను ‘రికార్డ్’ చేసి బీఆర్ఎస్ నాయకులకు అందించిన ఘటన ఖమ్మం రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

బీఆర్ఎస్ నాయకులు మంత్రి పొంగులేటి, ఉద్యోగుల వాయిస్ ను వినిపిస్తున్న చిత్రం

ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో ఆరోపించారు. పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, కందాళ ఉపేందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మెన్ లింగాల కమల్ రాజ్ తదితరుల ఈ అంశంపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి, ఉద్యోగుల మధ్య జరిగిన సంభాషణ ఆడియోను మీడియాకు వినిపించారు.

బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. అసలు తాను ఉద్యోగులతో చేసిన సంభాషణకు సంబంధించిన ‘రికార్డ్’ బీఆర్ఎస్ నాయకులకు ఎలా లభ్యమైందని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తనకు అనుమానం కలుగుతోందన్నారు. గతంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇప్పుడూ జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇంకా ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని, ఏ మామిడితోటల్లో, మరే ఫాం హౌజ్ లలో, ఎవరి ఇళ్లలో ఉండి ఇంకా ఎంత మంది దొంగతనంగా మాటలు వింటున్నారో, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయం తేలాల్సిన అవసరముందన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి స్పష్టం చేశారు.

మంత్రి పొంగులేటి మంగళవారం మీడియాతో మాట్లాడినప్పటి చిత్రం

ఇదే దశలో బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, విమర్శలపై పొంగులేటి మాట్లాడుతూ, తానో మంత్రినని, మంత్రిగా తనకున్స టైంలో అధికారులతో అనేక సమీక్షలు జరుపుతుంటానని స్పష్టం చేశారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. నా పార్టీకోసం ఓట్లు అడగడం తప్పా? అని కూడా ఆయన అన్నారు. ఉద్యోగులు కూడా ఓటర్లేనని, సామాన్యుడు వినియోగించుకున్న తరహాలోనే ఉద్యోగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారని, వారిని తాను ఓట్లు అడగడంలో తప్పేమిటని మంత్రి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికి కూడా అదే ఓటు ఉంటుందని, ఓటర్లుగా ఉన్నటువంటి ఉద్యోగులను తన పార్టీ కోసం అభ్యర్థించడంలో ‘వాట్ ఈజ్ రాంగ్?’ అని పొంగులేటి అన్నారు. ఇదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడిన వ్యాఖ్యల వీడియోను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు.

ఏలూరి శ్రీనివాసరావు

కాగా ఇంతకీ మంత్రి పొంగులేటి ఉద్యోగులతో చేసిన సంభాషణకు సంబంధించిన ‘వాయిస్ రికార్డు’ను ఎవరు చేసి ఉంటారని టీఎన్జీవో కాలనీస్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును ‘సమీక్ష’ న్యూస్ ప్రశ్నించగా, వందలాది మంది పాల్గొన్న ఈ గ్రూప్ కాల్ లో తాము ఎవరిని గుర్తించగలమని అన్నారు. తమ ఉద్యోగుల కాలనీ సమస్యలను ప్రస్తావించేందుకు తాము మంత్రితో మాట్లాడి పరిష్కారాన్ని కోరుకోవడంలో తప్పేమిటని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత పవర్ ఫుల్ మంత్రిగా ప్రాచుర్యం పొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎన్నికల వేళ బద్నాం చేసే విధంగా గ్రూప్ కాల్ సంభాషణను ‘రికార్డ్’ చేసిన ప్రభుత్వ ఉద్యోగి ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటి ప్రకటించినట్లు ఈ అంశం విచారణలో తేలుతుందేమో చూడాలి..!

Popular Articles