Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

రాతమీద నిలబడలేని ‘ముచ్చట’ అవసరమా శీనూ..!?

నిఖార్సయిన జర్నలిస్ట్ అనేవాడు మాట మీద నిలబడాలి.. ఇంకా స్పష్టంగా, సూటిగా చెప్పాలంటే రాసిన రాతల మీద నిటారుగా నిలబడాలి. తన రాతలకు తాను కట్టుబడి ఉన్నట్లు అవసరమైన సందర్భంలో నిక్కచ్చిగా చెప్పగలగాలి. అప్పుడే రాసిన రాతలకు విశ్వసనీయత ఉంటుంది. కానీ పబ్లిష్ చేసిన గంటల్లోనే తాను రాసిన రాతలను అర్జంటుగా చెరిపేసే వాళ్లను నిఖార్సు జర్నలిస్టు అనొచ్చా? అతను ప్రచురించిన కథనాలను విశ్వసనీయత గల రాతలుగా భావించవచ్చా? అసలు పరిగణనలోకి తీసుకోవచ్చా? దీన్ని పలాయనవాదపు జర్నలిజం అని సంబోధించడంలో తప్పేమీ లేదు కదా? ఈ ప్రశ్నలన్నీ దేనికంటే…

విషయాన్ని నేరుగానే చెబుతున్నా.. నర్మగర్భంగా చెప్పడం లేదు. చెప్పీ, చెప్పనట్టుగా చెప్పడానికి నేను విరుద్ధం. ‘ముచ్చట’ అనే ఓ వెబ్ సైట్ గురించి అనివార్యమైన ‘సమీక్ష’ ఇది. జర్నలిజపు ప్రమాణాలను, నైతికతను గుర్తు చేసే ‘సమీక్ష’ మాత్రమే. ‘ముచ్చట’ వెబ్ సైట్ నిర్వాహకుని చర్యలపై సీనియర్ జర్నలిస్ట్ బీటీ గోవిందరెడ్డి కొన్ని నెలల క్రితం ఏమన్నారో తెలుసా? ‘శ్రీనివాసరావుగారూ, నా పోస్టులను కాపీ చేసి ముచ్చటలో పెట్టకండి’ అన్నారు. ‘ముచ్చట ఎంఎస్ఆర్ దొంగిలించిన నా పోస్టులు. ఫ్రెండ్స్ ఇలాంటి కాపీరాయుళ్లకు ఎలా ‘హితవు’ చెప్పాలో మీరు సూచించండి’ అని నెటిజన్లను ఫేస్ బుక్ వాల్ పై బీటీ గోవిందరెడ్డి కోరారు. దీంతో గప్ చుప్ గా బీటీ గోవిందరెడ్డి పోస్టులను సైట్ నిర్వాహకుడు డిలీట్ చేశాడనేది వేరే విషయం.

ఇక ప్రముఖ పత్రిక ‘ఈనాడు’వెబ్ సైట్ లో ప్రచురితమైన ఓ ఆర్టికల్ ను సబ్ హెడ్డింగులు (ఉప శీర్షీకలు) సహా ఉన్నది ఉన్నట్లుగా వాడేసుకుని, తనకు వాట్సాప్ గ్రూపుల్లో కనిపించిందని ప్రకటించడం కూడా ‘ముచ్చట’ సైట్ నిర్వాహకుని స్పెషాలిటీగానే చెప్పవచ్చు. ఈ తరహా కంటెంట్ చోరుల అంశాల్లో ‘ఈనాడు’ లీగల్ హెచ్చరికల ప్రకటనలు కూడా జారీ చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ నాలుగైదు రోజుల క్రితం చేసిన ఆరోపణ ఏమిటో గుర్తుందిగా?

బరి తెగించిన చోరీ ‘ముచ్చట’!

రాష్ట్రంలో ‘మిస్ ఇన్ఫర్మేషన్’ మీడియా నడుస్తోందని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. సీఎంవో నుంచి ఫేక్ న్యూస్ రాకెట్ నడుస్తోందటూ ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవ, అవాస్తవాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన జాబితాలో ‘ముచ్చట’ కూడా ఉండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఫేక్ వార్తలు రాయిస్తున్న వెబ్ సైట్ల పేర్లలో ‘ముచ్చట’ను కూడా క్రిశాంక్ పేర్కొన్నారు. ఇవన్నీ కాసేపు వదిలేద్దాం. ఇప్పుడు అసలు విషయంలోకి వెడదాం.

మన్నె క్రిశాంక్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడినప్పటి చిత్రం

‘ముచ్చట’లో దాని నిర్వాహకుడు మంచాల శ్రీనివాసరావు నిన్న ఓ వార్తా కథనాన్ని ప్రచురించాడు. ‘ఖడ్గతిక్కన ఏదో యుద్ధానికి పోతున్నట్టు… ఎందుకీ హఠాత్ హంగామా..’ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీరును ప్రశ్నిస్తున్నట్టుగా ఆయా శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించాడు. ఆ వార్తా కథనంలో వాడిన భాషను, కేసీఆర్ ను ఉద్ధేశిస్తూ ఉటంకించిన పరుష పదజాలాన్ని జర్నలిజపు నైతికతను, ప్రమాణాలను పాటిస్తూ ‘సమీక్ష’ రాయదల్చుకోలేదు. కానీ ఏబీఎన్ రాధాకృష్ణ భాషే.. అంటూ వాడిన పద ప్రయోగంతో వార్తా కథనాన్ని ప్రచురించాడు. కేసీఆర్ సిట్ విచారణకు హాజరైన సందర్భంగా బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమాలను వెటకరిస్తూ, ఓరకంగా దెప్పిపొడుస్తూ ‘ముచ్చట’ ఆయా వార్తా కథనాన్ని ప్రచురించిందన్నమాట.

సరే.. జర్నలిస్టులుగా చెప్పుకునే వ్యక్తులు ఎవరి శైలిలో వాళ్లు వార్తా కథనాలు రాసుకోవచ్చు. ఇందులో అభ్యంతరమేమీ లేకపోవచ్చు. కానీ ‘ ఏబీఎన్ రాధాకృష్ణ భాషే’ అంటూ పక్కవాళ్ల భుజంపై అక్షర తుపాకీ పెట్టినట్లు రాసిన ఈ తరహా వార్తా కథనానికి ‘ముచ్చట’ శ్రీనివాసరావు కనీసం 24 గంటల వరకైనా నిలబడకపోవడమే అసలు విశేషం. ఇంతకీ ఏమైంది ఆ వార్తా కథనం అనుకుంటున్నారా? నిన్న తెలంగాణా భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఏబీఎన్ కెమెరామెన్ పై దాడి చేసిన ఘటన గుర్తుకొచ్చిందో..? లేక కేసీఆర్ ను సిట్ విచారణ చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ కేడర్ నిరసన ప్రదర్శనలను చూసి భయపడ్డాడో ఏమో తెలియదుగాని, కొద్ది వ్యవధిలోనే ‘ముచ్చట’ శ్రీనివాసరావు ఆయా వార్తా కథనం కనిపించకుండా చేశాడు.

తెలంగాణా భవన్ వద్ద ఏబీఎన్ కెమెరామెన్ పై దాడి చేసినప్పటి చిత్రం

అంటే ‘పబ్లిష్’ చేసిన స్టోరీని డిలీట్ చేశాడన్నమాట. పూర్తిగా డిలీట్ చేశాడో, ప్రయివేట్ మోడ్ లో పెట్టాడో, ‘ట్రాష్’లోకి విసిరేశాడో క్లారిటీగా తెలియదుగాని, ఆ వార్తా కథనాన్ని ఏవేని మార్పులతో మళ్లీ పబ్లిష్ చేస్తాడేమోనని ఇప్పటి వరకు వేచి చూశా. కానీ ఈ వార్తా కథనం రాస్తున్న సమయానికి, అంటే సోమవారం ఉదయం 11.00 గంటల వరకు కూడా ఆ కథనం మళ్లీ కనిపించలేదు. ఈ తరహాలో ఓసారి ‘పబ్లిష్’ చేసిన వార్తా కథనాలను డిలీట్ చేయడం ‘ముచ్చట’కు కొత్తేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ తరహా చర్యలకు ‘ముచ్చట’ సైట్ నిర్వాహకుడు పాల్పడిన ఉదంతాలు చాలా ఉన్నాయి.

అందువల్ల చివరగా చెప్పొచ్చేదేమిటంటే.. ‘రాసిన రాతలకు నిలబడకుండా మధ్యలోనే ‘మాయం’ చేసే చర్యలను సిసలైన జర్నలిజంగా ప్రజలు భావించరు. పాఠకలోకంలోనూ ఈ కథనాల తీరు పలుచన అవుతుంది. రాసినవాడిని ఉత్త పిరికివాడు అని కూడా మన సోదర జర్నలిస్టులే భావించవచ్చు. ఈ తరహా ‘కంటెంట్’కు క్రెడిబిలిటీ కూడా ఉండదు. నిలకడలేని రాతలను నిఖార్సు జర్నలిజంగానూ పరిగణించరు. మాటమీద నిలబడని వ్యక్తి అనే భావన పాఠకలోకంలో నాటుకుపోవచ్చు.’

కాబట్టి పబ్లిష్ చేసిన కథనంపై నిలబడలేని ‘ముచ్చట’ అవసరమా శీనూ..? నీకంటే ‘ఈనాడు’లో సీనియర్ గా, నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నా.., చేర్యాలలో ఈనాడు కంట్రిబ్యూటర్ నుంచి హైదరాబాద్ వరకు ఎదిగిన నీ జర్నలిజపు ‘ప్రస్థానం’ గురించి క్లియర్ గా తెలిసిన జర్నలిస్టుగా చెబుతున్నా., మధ్యలో డిలీట్ చేసే కథనాల ‘దుకాణం’ బంద్ జేయ్ శీనూ..! నీ హితవు కోరి మళ్లీ ఓసారి చెబుతున్నా.. ఈ టైపు కథనాలు రాయకు శీనూ..! ఎందుకంటే అసలే బీఆర్ఎస్ వాళ్ల దృష్టిలో నువ్వూ, నీ రాతలు పడినట్లున్నాయ్. కాస్త జాగ్రత్త శీనూ.. ‘ఈనాడు’లో కలిసి పనిచేసిన నీ హితునిగా ఈ విషయాలను చెబుతున్నందుకు ఏమీ అనుకోకు శీనూ..!

ఎహె.. నేను ఆ టైపు స్టోరీ ఏదీ రాయలేదు. నన్నెవరూ చూడలేదు..దమ్ముంటే ఈ వార్తా కథనాన్ని చూపించు అని నువ్వు బుకాయిస్తే, సవాల్ చేస్తే ‘నిజం’ దృశ్యాన్ని చూపిస్తానని, నువ్వు డిలీట్ చేసిన ‘ఖడ్గతిక్కన ఏదో యుద్ధానికి పోతున్నట్టు… ఎందుకీ హఠాత్ హంగామా..’ శీర్షికతో కూడిన ఆ వార్తా కథనాన్ని ప్రదర్శిస్తానని కూడా ప్రత్యేకంగా చెబుతున్నా శీనూ..! అన్నట్టు చెప్పడం మరిచాను.. నేను రాసిన ఈ నా అభిప్రాయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డిలీట్ చేయను శీనూ.. సరేనా..?

Popular Articles