హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు మరోసారి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నిన్న జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ ఇచ్చిన జవాబు గురించి తెలిసిందే. అయితే కేసీఆర్ ఇచ్చిన రిప్లయిని తిరస్కరించిన సిట్ అధికారులు అందుకుగల కారణాలను కూడా వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 1వ తేదీన విచారణకు హైదారాబాద్ అడ్రస్ లో అందుబాటులో ఉండాలంటూ మరోసారి శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ నోటీసులను నందినగర్ లోని ఇంటికి సిట్ అధికారులు అంటించారు.
కేసీఆర్ నివాసం బంజారాహిల్స్ లోని నందినగర్ లోనే ఉందని, అందువల్ల అక్కేడే విచారణ నిర్వహిస్తామని సిట్ అధికారులు స్పష్ట చేశారు. ఈమేరకు గతంలో కేసీఆర్ దాఖలు చేసిన అపిడవిట్ లోని చిరునామాను గుర్తు చేస్తూ వాటి ప్రతులను సిట్ అధికారులు విడుదల చేయడం విశేషం. ఎన్నికల అఫిడవిట్ తోపాటు రాష్ట్ర అసెంబ్లీ రికార్డుల్లోని అధికారిక సమాచారం ప్రకారం బంజారాహిల్స్ నందినగర్ లోని చిరునామాలోనే తాము విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఎర్రవెల్లిలోని నివాసంలో విచారణ జరపాలని కేసీఆర్ అభ్యర్థించినప్పటికీ, దర్యాప్తు సంస్థ ప్రయోజనాలను సమతుల్యం చేసేందుకు, కేసీఆర్ వయస్సును పరిగణనలోకి తీసుకుని, చట్టబద్ధమైన నిబంధనలకు అనుగణంగా అధికారిక రికార్డుల ప్రకారం కేసీఆర్ దర్యాప్తు స్థం మీ నివాసమే అవుతుందని సిట్ అధికారులు తాజాగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. అధికారిక రికార్డుల ప్రకారం నివాసం కాని ప్రదేశంలో విచారణ జరపాలన్న కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించడం సాధ్యం కాదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. విచారణ స్థలం అధికారిక రికార్డుల్లో నమోదైన సాధారణ నివాస స్థలాన్ని బట్టి నిర్ణయించబడుతుందని సిట్ పేర్కోంది.

అంతేగాక విచారణాంశం సున్నిత స్వభావం గలదని, అనేక ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డులను పరిశీలించాల్సి ఉంటుందని, వారిని ఎర్రవెల్లి చిరునామాకు తరలించడం పరిపాలనాపరంగా కష్టమవుతుందని సిట్ అధికారులు తమ నోటీసులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ ను సిట్ అధికారులు కోరారు. సిట్ అధికారులు తాజాగా జారీ చేసిన నోటీసు ప్రతిని దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు..

