మేడారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. గురువారం ఒక్కరోజే దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరికాసేపట్లో సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ తో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారని తెలిపారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. మేడారం జాతరలో శాశ్వత అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు, కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు,మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి రూ.2,500 కోట్ల వ్యయంతో బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా రామప్ప– లక్నవరం– జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్ట్ కు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మేడారానికి ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం, దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు చెప్పారు.

కాగా సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను భక్తులు నమ్మవద్దని, ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క,సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు లు శనివారం సాయంత్రం 4 గంటలకు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేస్తారన్నారు. మేడారం జాతరను ‘జాతీయ పండుగ’గా గుర్తించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. సమ్మక్క–సారక్క జాతరను ‘జాతీయ పండుగ’గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటనతో ఈ అంశం త్వరలోనే సాకారమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమ్మక్క–సారక్క జాతరను గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, మరో కుంభమేళాగా ఆయన అభివర్ణించారు. ఈ మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, సహకరిస్తున్న మీడియా మిత్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

