(సమీక్ష ప్రత్యేక కథనం)
దేశం కోసం.. ధర్మం కోసం ప్రజలంతా భక్తిభావంతో పనిచేయాలనేది బీజేపీని నిర్దేశిస్తున్నట్లు ప్రచారంలో గల ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ లు చెప్పే ప్రవచనం.. అయితే ఖమ్మం జిల్లా బీజేపీకి చెందిన ఇద్దరు నాయకులు నమ్మకద్రోహం, మోసపు అభియోగాలపై నమోదైన కేసులో నిందితులుగా మారడం ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తలనెప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి చెందిన ఏ సాధారణ కార్యకర్తో, లేదంటే గ్రామ స్థాయి నాయకుడో ఇటువంటి అభియోగాల్లో నిందితులుగా మారితే పార్టీ పెద్దలకు పెద్దగా పట్టింపు లేకపోవచ్చేమోగాని, సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుతోపాటు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కమ్ ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష స్థాయి నాయకుడు కూసంపూడి రవీంద్ర ఈ కేసులో నిందితులుగా ఉండడం గమనార్హం.
‘సిరి గోల్డ్’ అనే సంస్థకు సంబంధించిన పెను దుమారపు వివాదంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుపైనేగాక, బీజేపీకి చెందిన సత్తుపల్లి నాయకుడు కూసంపూడి రవీంద్రపైన నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతనెల 20వ తేదీన కేసు నమోదు చేసిన ఘటన పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారి తీసింది. బీఎన్ఎస్ చట్టంలోని 316(2),318(4),r/w 3(5) సెక్షన్లతోపాటు 5 TSPDFEA,3,4,5 PC&MCSBA చట్టం కింద కోటేశ్వర్ రావు, రవీంద్రలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి ఇచ్చి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో A1గా సత్తుపల్లికి చెందిన బీజేపీ నేత కూసంపూడి రవీంద్రను, A2గా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావును నిందితులుగా పొందుపరుస్తూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అయితే ఈ ఇద్దరు నాయకుల వ్యవహార తీరు ఇప్పుడు బీజేపీలోనేగాక, ఆర్ఎస్ఎస్ వ్యవస్థలోనూ చర్చకు దారి తీయడం విశేషం. అసలే కమ్యూనిస్టుల ప్రభావం గల జిల్లా, ఇటువంటి ప్రాంతంలో ఎప్పటికైనా ఎదగాలని పరితపిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి వీరిద్దరిపై నమోదైన కేసు తీవ్రత చికాకును కలిగిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ‘సిరిగోల్డ్’ సంస్థ కార్యకలాపాలే ఇప్పుడు జనంలో పెను అనుమానానికి దారి తీస్తున్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎమ్) పద్ధతిలో కరెన్సీ దోపిడీకి తీసిపోని విధంగా సిరిగోల్డ్ సంస్థ కలెక్షన్స్ ఉన్నట్లు దీని నిర్వహణ తీరు స్పష్టమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థ ప్రారంభించిన మూడేళ్ల వరకు కూడా ప్రకటించిన ప్రకారం ‘షాపు’ను ఏర్పాటు చేయకపోవడం, కేసు నమోదైన తర్వాత ఓ భవనంపై ‘COMING SOON’ అనే బ్యానర్ తగిలించినట్లు ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ. 20.00 కోట్ల మొత్తం వరకు ‘గొలుసుకట్టు’ విధానంలో సిరిగోల్డ్ సంస్థ నిర్వాహకులు ప్రజల నుంచి వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఈత ఆకు ఇచ్చి తాటి ఆకు’ నొక్కేసిన చందంగా సిరిగోల్డ్ వసూళ్ల దందా కొనసాగినట్లు, ఇంకా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం దందాకు కేంద్ర బిందువైన ‘సిరిగోల్డ్’ సంస్థ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ కూసంపూడి రవీంద్ర సత్తుపల్లి ప్రాంతంలో గతంలో నిర్వహించిన వివిధ వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ‘ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులిస్తాం.. అనే స్కీంలన్నీ స్కాంలేనని’ వివిధ కేసుల ఉదంతాల్లో సాక్షాత్తూ ఐపీఎస్ అధికారులే స్పష్టం చేయడం ఈ సందర్భంగా గమనార్హం.

ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన నాయకులే ఈ తరహా ‘స్కీం’ దందాకు తెరలేపి కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లు అభియోగాలు ఎదుర్కోవడం, కేసుల్లో నిందితులుగా మారడమే రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిరిగోల్డ్ దందాలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుపై, సత్తుపల్లి నాయకుడు కూసంపూడి రవీంద్రపై నమోదైన కేసు అంశంలో రాష్ట్ర నాయకత్వం స్పందించే తీరుకోసం ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. కేసు నమోదై పది రోజులు దాటినప్పటికీ, పోలీసులు ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలే కొందరు నిర్వాహకులుగా ఉన్నటువంటి సిరిగోల్డ్ సంస్థ ‘గొలుసుకట్టు’ వసూళ్ల బాగోతమేంటి? సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ కూసంపూడి రవీంద్ర నేపథ్యం ఏమిటి? పోలీసులు స్పష్టీకరిస్తున్న ప్రకారం.. చట్టబద్ధం కాని చెయిన్ సిస్టమ్ స్కీం ద్వారా కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు గల సిరిగోల్డ్ సంస్థ నిర్వాహకుడైన కూసంపూడి రవీంద్ర ఎవరు? బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు సిరిగోల్డ్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్నట్లు సంస్థ నిర్వాహకులు ముద్రించిన బ్రోచర్, యాసా నాగేశ్వర్ రావు వ్యవహారంలో జరిగిన ‘సెటిల్మెంట్’ పత్రం స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా సిరిగోల్డ్ దందాకు ‘కీలక’ సూత్రధారి కూసంపూడి రవీంద్ర ‘గొలుసుకట్టు’ వసూళ్ల కథా కమామీషు ఏమిటో ‘సమీక్ష’ న్యూస్ లోతైన పరిశోధన చేస్తోంది.

ఈ వసూళ్ల అంశంలో ఇప్పటికే పలు ఆధారాలను ‘సమీక్ష’ న్యూస్ సంపాదించింది. మరింత లోతైన పరిశోధన కోసం ఎవరైనా సరే 90528 79933 ఫోన్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా సమాచారాన్నిగాని, పత్రాలనుగాని అందించవచ్చు. సమాచారం అందించేవారి గోప్యతపై ఎటువంటి సందేహం అక్కర్లేదు.
(ఎవరీ కూసంపూడి రవీంద్ర? ఏమా సిరిగోల్డ్ ‘చెయిన్’ దందా?.. తర్వాత కథనంలో)

